
న్యూఢిల్లీ: ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న ఎడ్టెక్ స్టార్టప్ బైజూస్ ఖాతా పుస్తకాలను త్వరగా పరిశీలించి రిపోర్ట్‌ను సమర్పించాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ఫీల్డ్ ఆఫీసర్స్‌ను కోరిందని సీనియర్ అధికారి ఒకరు సోమవారం తెలిపారు. కంపెనీల చట్టాన్ని అమలు చేస్తున్న ఈ మంత్రిత్వ శాఖ తన ప్రాంతీయ కార్యాలయం నుంచి రిపోర్ట్‌ను వచ్చాక తదుపరి చర్యలను తీసుకుంటుంది.
గత జూలైలో బెంగళూరులో రిజిస్టర్ అయిన థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని తనిఖీ చేయాలని మంత్రిత్వ శాఖ హైదరాబాద్‌లోని ప్రాంతీయ డైరెక్టర్ కార్యాలయాన్ని కోరింది. థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ బైజూస్ బ్రాండ్ కింద పనిచేస్తుంది. తనిఖీకి సంబంధించిన నిర్దిష్ట వివరాలు తెలియలేదు. ఈ కంపెనీలో పలు ఘటనలు జరగడం, ఆడిటర్ రాజీనామా చేయడం వంటి అనేక పరిణామాల నేపథ్యంలో కేంద్రం తనిఖీకి ఆదేశించింది.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) కొన్ని ఆర్థిక సంవత్సరాల్లో సంస్థ వెల్లడించిన ఆర్థిక వివరాలను కూడా పరిశీలిస్తోంది. బైజూస్ ఫౌండర్, సీఈఓ బైజు రవీంద్రన్, ఆయన కుటుంబ సభ్యులను బోర్డు నుంచి తొలగించాలని బైజూస్ షేర్‌హోల్డర్లు శుక్రవారం ఏకగ్రీవంగా ఓటు వేశారు. అయితే, కంపెనీ వ్యవస్థాపకులు లేనప్పుడు జరిగిన ఓటింగ్ చెల్లుబాటు కాదని రవీంద్రన్ వాదిస్తున్నారు.