ప్రైవేటు దిశగా ఆర్టీసీ!

ప్రైవేటు దిశగా ఆర్టీసీ!

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీని మెల్లమెల్లగా ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కార్మికుల సమ్మెపై కఠినంగా వ్యవహరిస్తామంటున్న సర్కారు.. ఈ పరిస్థితిని సాకుగా తీసుకుని, సంస్థను ప్రైవేటు వైపు తీసుకెళుతున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో 10 వేలకుపైగా బస్సులతో సర్వీసులు నిర్వహిస్తున్నారు. అందులో ఎనిమిది వేల బస్సులు ఆర్టీసీ సొంతవికాగా, రెండు వేలకుపైగా అద్దె బస్సులు ఉన్నాయి. ఆర్టీసీ సొంత బస్సుల్లోనూ 2,600 బస్సులు ఫిట్​నెస్​ కోల్పోయాయి. ప్రమాదకరంగా మారిన ఆ బస్సుల స్థానంలో కొత్తవి కొనాల్సి ఉంది. కానీ అలా చేయకుండా ప్రైవేటు వ్యక్తుల నుంచి అద్దె బస్సులను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే మొత్తం పదివేలకుపైగా బస్సుల్లో నాలుగున్నర వేలకుపైగా (45 శాతానికిపైగా) అద్దెబస్సులే ఉంటాయి. ఇవే కాదు ఇకముందు కూడా ఫిట్​నెస్​ కోల్పోయే బస్సుల స్థానంలోనూ అద్దెబస్సులనే తీసుకోవాలని భావిస్తున్నారు. అంటే మెల్లమెల్లగా ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్య 75 శాతం వరకు చేరితే.. ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించవచ్చని ఓ మంత్రి అభిప్రాయపడటం గమనార్హం.

కొత్తవి కొనలేక..

ఆర్టీసీ నష్టాల్లో ఉండటంతో కొత్త బస్సులు కొనలేని పరిస్థితి ఉంది. దాంతో ఫిట్​నెస్​ లేని బస్సులనూ తిప్పుతున్నారు. అవి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అద్దె బస్సులను తీసుకోవడం మేలని సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్తవి కొనడానికి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేకపోవడంతోపాటు, వేతనాలు, నిర్వహణ ఖర్చు తగ్గుతుందని ఆలోచిస్తోంది. అద్దె బస్సుల వల్ల ఆర్టీసీకి ఆదాయం వస్తోందని, సొంత బస్సులతో భారీగా నష్టాలు వస్తున్నాయని అధికారులు అంటున్నారు. సంస్థకు బస్సు అద్దెకు ఇచ్చిన వారే సొంతంగా డ్రైవర్లను పెట్టుకుంటారు, డీజిల్  పోయించుకుని నడిపిస్తారు. ఆర్టీసీ కిలోమీటర్​కు ఇంత అని లెక్కించి వారికి డబ్బు చెల్లిస్తుంది. కండక్టర్లను పెట్టుకుని టికెట్ల చార్జీలను తీసుకుంటుంది. అయితే ఆర్టీసీ సొంత బస్సుల నిర్వహణపై కిలోమీటర్​కు రూ.12 నష్టం వస్తుండగా అద్దె బస్సుల నుంచి 75 పైసల చొప్పున లాభం వస్తోందని అధికారులు చెప్తున్నారు. దీంతో సొంత బస్సులను తగ్గించుకుని, అద్దె బస్సులను పెంచితే లాభాలొస్తాయని అంటున్నారు.

పోస్టుల భర్తీ లేనట్టే!

ఆర్టీసీలో కొత్త బస్సులు కొనుగోలు చేయడం లేదు, దాంతో కొత్త నియామకాలు లేవు. అద్దె బస్సుల సంఖ్య పెరిగిన కొద్దీ ఉద్యోగుల అవసరం తగ్గిపోతుంది. దాంతో రిటైరవుతోన్న వారి స్థానాల్లో కొత్త వారి నియామకాలు కూడా ఉండవు. కేవలం అడ్మినిస్ట్రేషన్ కోసం కావాల్సిన డిపో మేనేజర్లు, సూపర్ వైజర్లు, రీజినల్ మేనేజర్లు, అకౌంటింగ్ స్టాఫ్​ మాత్రమే నియమిస్తారు. దాంతో వేతనాల ఖర్చు బాగా తగ్గిపోతుందని భావిస్తున్నారు. ఈ విషయంగా ముందే ఓ ఆలోచన ఉండటంతోనే ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయాలు ఉన్నాయి.

టికెట్ ధరలు సర్కారు చేతిలోనే..

అద్దె బస్సులు పెరిగినా టికెట్ ధరలను ప్రభుత్వమే నిర్ణయిస్తుందని అధికారులు చెప్పారు. ప్రైవేటు వ్యక్తులు బస్సులు నడపడం వరకే పరిమితం అవుతారన్నారు. అద్దె బస్సుల్లో ఆర్టీసీ కండక్టర్లు టికెట్లు ఇస్తున్నారని, ఇదే కొనసాగుతుందని తెలిపారు. మారుమూల ప్రాంతాలకు బస్సులు నడిపేందుకు ప్రైవేటు వ్యక్తులు ముందుకు వచ్చే పరిస్థితి లేదని, గ్రామీణ రూట్లలో ఆర్టీసీ బస్సులు తిప్పక తప్పదని పేర్కొన్నారు.