తెలంగాణలో కొత్తగా 203 ఊర్లలో సర్కారీ ప్రైమరీ స్కూళ్లు

తెలంగాణలో  కొత్తగా 203 ఊర్లలో సర్కారీ ప్రైమరీ స్కూళ్లు
  •     ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు
  •     ప్రతి పంచాయతీలో స్కూల్‌‌ ఉండాలన్న సీఎం ఆదేశాలతో అధికారుల కసరత్తు
  •     మూతపడ్డ స్కూళ్లనూ రీఓపెన్‌‌ చేయించేందుకు చర్యలు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో కొత్త సర్కారీ స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రభుత్వ స్కూల్ ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. 2024–25 విద్యా సంవత్సరంలో 203 గ్రామాల్లో కొత్తగా ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యా శాఖపై సీఎం రివ్యూ చేశారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో పిల్లలు లేక స్కూళ్లు మూతపడ్డాయని, ఇప్పటికీ స్కూళ్లు లేని గ్రామ పంచాయతీలు ఉన్నాయని అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. చిన్న జీపీ అయినా సరే ప్రతి పంచాయతీలో ఒక స్కూల్ పెట్టాలని అప్పట్లో విద్యా శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. దీంతో అధికారులు జిల్లాల నుంచి వివరాలు సేకరించారు. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా, 265 జీపీల్లో స్కూళ్లు లేవని తేలింది. వీటిలో 203 గ్రామ పంచాయితీల్లోనే స్కూళ్లు అవసరమని అధికారులు గుర్తించారు. మరో 62 గ్రామాల్లో పిల్లలు లేకపోవడంతో స్కూళ్ల ఏర్పాటు అవసరం లేదని సర్కారుకు నివేదిక అందించారు. గత బీఆర్ఎస్ సర్కారు పిల్లలు లేరనే సాకుతో ఉన్న స్కూళ్లను మూసివేస్తే.. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సర్కారీ స్కూళ్లు తెరుస్తుండటంపై టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, మూతపడ్డ స్కూళ్లనూ రీఓపెన్ చేయించేందుకు సర్కారు ప్రణాళికలు రూపొందిస్తోంది. 

నల్గొండలో అత్యధిక స్కూళ్లు..

అత్యధికంగా నల్గొండ జిల్లాలో 24 కొత్త స్కూళ్లను ప్రారంభించనున్నారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యాదాద్రి భువనగిరి జిల్లాలో 21 చొప్పున, వరంగల్‌‌‌‌‌‌‌‌లో 16 కొత్త స్కూళ్లను ప్రారంభించనున్నారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 14 పంచాయతీల్లో స్కూళ్లు లేవని, ఇందులో 11 జీపీల్లో కొత్త స్కూళ్లు అవసరం లేదని అధికారులు గుర్తించారు. వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 24 జీపీల్లో స్కూళ్లు అందుబాటులో లేకపోగా, ఇందులో 12 జీపీల్లో అసలు కొత్త స్కూళ్లే అవసరం లేదని వెల్లడించారు. హైదరాబాద్, గద్వాల, మేడ్చల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలు మినహా ప్రతి జిల్లాలోనూ ఒకటి ఆపై స్కూళ్లు మూతపడ్డాయి. గ్రామాల్లో కొత్త స్కూళ్లను ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. జూన్‌‌‌‌‌‌‌‌లో జరిగే బడిబాటలో భాగంగా ఆయా గ్రామ పంచాయతీల్లో పిల్లలను గుర్తించి, వారికి స్కూళ్లలో అడ్మిషన్లు ఇప్పించాలని భావిస్తున్నారు. అందుబాటులో ఉన్న టీచర్లనే కొత్త స్కూళ్లలో సర్దుబాటు చేయాలని యోచిస్తున్నారు.