హ్యామ్ రోడ్లకు బ్యాంక్ గ్యారంటీ!..60 శాతం పెండింగ్ బిల్లుల చెల్లింపునకు అభయం

హ్యామ్ రోడ్లకు బ్యాంక్ గ్యారంటీ!..60 శాతం పెండింగ్ బిల్లుల చెల్లింపునకు అభయం
  •     కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో సర్కారు నిర్ణయం
  •     పనులు స్పీడ్ అందుకునే అవకాశం

హైదరాబాద్, వెలుగు:  హ్యామ్ రోడ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విధానంలో రోడ్డు నిర్మాణ పనులు మొదలైనప్పుడు కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ మొబిలైజేషన్ కింద 10 శాతం, వర్క్ ముగిసేనాటికి 30 శాతం నిధులు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. పనులు పూర్తయ్యాక 60 శాతం నిధుల చెల్లింపునకు 15 ఏళ్ల గడువు పెట్టింది. 

పనులు పూర్తిచేసిన 15 ఏండ్ల దాకా నిధులు రావనే భయంతో కాంట్రాక్టర్లెవరూ టెండర్లు వేసేందుకు ముందుకురావవడం లేదు. దీంతో 60 శాతం పెండింగ్ బిల్లుల చెల్లింపునకు బ్యాంక్​గ్యారంటీ ఇవ్వడానికి సర్కారు సిద్ధమైంది. ఈ నిర్ణయం వల్ల హ్యామ్​రోడ్ల ప్రక్రియ స్పీడందుకునే అవకాశం కనిపిస్తున్నది.  

జూన్​లో జీవో.. అక్టోబర్​లో టెండర్లు!

రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లలను దశలవారీగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్) విధానంలో తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 96 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న13 వేల కిలోమీటర్ల ఆర్​అండ్​బీ, పంచాయతీ రాజ్ రోడ్లను డెవలప్ చేయాలని నిర్ణయించింది. కర్నాటకలో సక్సెస్​ అయిన ఈ ఫార్ములాను రాష్ట్రంలోనూ అనుసరించాలని భావించింది. 

గతేడాది జూన్ 20న జీవో జారీ చేసింది. జీవోలో బిల్లుల చెల్లింపు విధానంలో కొత్త నిబంధన తీసుకొచ్చింది. హ్యామ్ విధానంలో రోడ్డు నిర్మాణ పనులు మొదలైనప్పుడు అడ్వాన్స్ మొబిలైజేషన్ కింద 10 శాతం, వర్క్ ముగిసేనాటికి బ్యాలెన్స్ డబ్బుల్లో 30 శాతం నిధులు ఇవ్వడానికి సర్కారు నిర్ణయించింది. 

పనులు పూర్తయ్యాక 60 శాతం నిధుల చెల్లింపుకు 15 ఏళ్ల గడువు పెట్టింది. సబ్​ కమిటీ, రాష్ట్ర కేబినెట్​ ఆమోదం పొందిన తర్వాత అక్టోబర్ నెలలో టెండర్లు పిలిచారు. ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో రూ.10,547 కోట్లతో 5,566 కి.మీ. రోడ్ల పనులను 32 ప్యాకేజీలుగా, పంచాయతీ రాజ్ శాఖ తరఫున రూ. 6294.81 కోట్ల ఖర్చుతో 7,449.50 కి.మీ మేర చేపట్టాల్సిన పనులను 17 ప్యాకేజీలుగా విభిజించి టెండర్లు పిలిచారు.

60 శాతం పెండింగ్​ బిల్లుల చెల్లింపుకు సర్కారు అభయ హస్తం​

హ్యామ్​ విధానంలో చేపట్టబోయే రోడ్లకు సంబంధించి ఇంజినీర్లు కాంట్రాక్టర్లతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. పనులు పూర్తయ్యేలోగా 40 శాతం బిల్లులను సర్కారు చెల్లిస్తే మిగిలిన 60 శాతం నిధుల్లో 20 శాతం కాంట్రాక్టర్​ సమకూర్చుకోవాలని, మిగతా 40 శాతం బ్యాంక్ లోన్లు తీసుకోవాలని, ఈ నిధులను 15 ఏళ్ల కాలపరిమితిలో విడతలవారీగా సర్కారు చెల్లిస్తుందని చెప్పడం పైనే కాంట్రాక్టర్లు అభ్యంతరం చెబుతూ వచ్చారు. ‘సర్కారు మారితే.. కొత్తగా వచ్చిన ప్రభుత్వం మాకు బిల్లులు చెల్లిస్తారని ఏంటీ గ్యారంటీ’ అని ఇంజినీర్లను పదే పదే ప్రశ్నించారు. 

కర్నాటకలో ఇదే విధానం అనుసరించినప్పటికీ అక్కడ 15 ఏండ్ల పాటు టోల్ వసూలుకు అవకాశమిచ్చారని, కానీ.. ఇక్కడ ఆ పరిస్థితి లేనందునవల్ల తమ సంస్థలు దివాలా తీస్తాయని కొందరు కాంట్రాక్టర్లు కుండబద్దలు కొట్టినట్లుగా ఇంజినీర్లకు చెప్పారు. దీంతో బ్యాంకర్లతో ఎన్ని సమావేశాలు పెట్టినా పనులు చేపట్టడానికి టెండర్లు వేయడానికి ముందుకు రాలేదు. దీంతో ఇంజినీర్లు టెండర్ గడువు పెంచుకుంటూ పోయారు. ఆర్ అండ్ బీ శాఖలోనే కాదు పంచాయతీ రాజ్ టెండర్ల విషయంలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. 

దీనిపై ఇటీవల మేడారంలో జరిగిన రాష్ట్ర కేబినెట్​లో ప్రభుత్వం చర్చించింది. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి చేపట్టిన విధానంలో మాదిరిగానే హ్యామ్ రోడ్ల కోసం బ్యాంక్ గ్యారంటీలను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేలాగా నిర్ణయం తీసుకున్నది. ఏ ప్రభుత్వం మారినా పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు పెండింగ్​ బిల్లులు ఆపకుండా చెల్లించేలా చర్యలు తీసుకుంటూ జీవో జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నది. 

 గ్యారంటీ జీవో రానున్నది!

హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి 15 ఏళ్ల గడువులో విడుతల వారిగా చెల్లించనున్న 60 శాతం బిల్లులకు సంబంధించి కాంట్రాక్టర్లపై భారం పడకుండా ప్రభుత్వమే బ్యాంక్​ గ్యారంటీ జీవో తీసుకురానున్నది. ఈ జీవో వస్తే కాంట్రాక్టర్లు రోడ్ల పనులు చేపట్టడానికి ముందుకు వచ్చి టెండర్లు వేసే అవకాశం ఉంటుంది. దీంతో రాష్ట్రంలో హ్యామ్ రోడ్ల పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయి. 
- వెంకటేశ్వర్ రావు, చీఫ్ ఇంజినీర్, హ్యామ్ రోడ్స్ విభాగం, ఆర్​ అండ్​బీ శాఖ, హైదరాబాద్