అంగన్ వాడీలకు కొత్త ఫోన్లు.. 38 వేల130 శామ్ సంగ్ మొబైల్స్ కొనుగోలు చేసిన ప్రభుత్వం..

అంగన్ వాడీలకు కొత్త ఫోన్లు.. 38 వేల130 శామ్ సంగ్ మొబైల్స్ కొనుగోలు చేసిన ప్రభుత్వం..
  • వారం పది రోజుల్లో పంపిణీ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి  
  • అంగన్​వాడీ టీచర్లు, ఐసీడీఎస్ సూపర్​వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు పంపిణీ
  • శామ్​సంగ్ గెలాక్సీ ఎ06  4జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ స్పెస్
  • రూ. 44.42 కోట్లతో టీజీటీఎస్ ద్వారా ఆర్డర్
  • పాత ఫోన్లతో ఇబ్బందులు తీరనున్నట్లే..

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అంగన్​వాడీ టీచర్లకు కొత్త మొబైల్ ఫోన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోషణ్ ట్రాకర్ ద్వారా అంగన్​వాడీ వివరాలను అప్డేట్ చేసేందుకు ఇదివరకే ప్రభుత్వం ఇచ్చినవి ఫోన్లు పాతబడిపోవడంతో.. కొత్త ఫోన్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వారం, పది రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లను అందజేయనున్నారు. పంపిణీ కార్యక్రమానికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ టెక్నాలజీస్ సర్వీసెస్ (టీజీటీఎస్) ద్వారా ఇప్పటికే 38,130 మొబైల్ ఫోన్లను కొనుగోలు చేశారు. ఒక్కో ఫోన్‌ కు రూ.11,650 చొప్పున మొత్తం రూ. 44,42,14,500 వెచ్చించారు. ఇందులో అంగన్​వాడీ టీచర్లకు 35,781 ఫోన్లు, ఐసీడీఎస్ సూపర్ వైజర్లకు 1452, పోషణ్ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్లకు 149 ఫోన్లతో పాటు 748 ఫోన్లను బఫర్ స్టాక్‌ గా ఉంచనున్నారు.

మొండికేసిన పాత ఫోన్లు..

గతంలో 2019లో అంగన్​వాడీలకు ప్రభుత్వం మొబైల్​ఫోన్లు ఇచ్చింది. రూల్స్ ప్రకారం ప్రతి ఐదేండ్లకోసారి కొత్తవి ఇవ్వాల్సి ఉన్నా.. కాలం చెల్లిన ఫోన్లతోనే టీచర్లు కుస్తీ పడుతున్నారు. ఐదేళ్ల కింద ఇచ్చినవి 2జీ ఫోన్లు కావడం, సాఫ్ట్‌ వేర్ అప్‌ డేట్ కాకపోవడంతో నెట్‌వర్క్ సమస్యలు వేధిస్తున్నాయి. చాలా ఫోన్లలో బ్యాటరీలు ఉబ్బిపోయి, డిస్‌ ప్లేలు పగిలి పనికిరాకుండా పోయాయి. దీంతో చేసేదేం లేక చాలామంది అంగన్​వాడీలు సొంత డబ్బులతో రిపేర్లు చేయించుకుంటూ నెట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఫోన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది.

4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీతో.. 

ఈసారి అంగన్​వాడీలకు అధునాతన ఫీచర్లు ఉన్న శామ్​సంగ్ గెలాక్సీ ఎ06 మోడల్ ఫోన్లను అందిస్తున్నారు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీతో ఇవి పనిచేస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ జీఈఎం పోర్టల్ గైడ్‌లైన్స్ ప్రకారం.. మొబైల్ ఫోన్‌తో పాటు ఐదు రకాల యాక్సెస్సరీస్ ఇస్తున్నారు. ఇందులో ఎం.డి.ఎం సాఫ్ట్‌వేర్, అడాప్టర్, డేటా కేబుల్, స్క్రీన్ గార్డ్, డస్ట్ ప్రూఫ్ పౌచ్, మొబైల్ క్యారీ కేసు ఉన్నాయి. వీటికి రెండేళ్ల వారంటీ కూడా ఉండనున్నట్లు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు చెబుతున్నారు. 

స్పీడ్ కానున్న పనులు.. 

అంగన్​వాడీ టీచర్లు ప్రతిరోజూ పోషణ్ ట్రాకర్ యాప్ ద్వారా దాదాపు 14 రకాల వివరాలను అప్‌ డేట్ చేయాల్సి ఉంటుంది. సెంటర్ తెరిచిన టైమ్ నుంచి.. పిల్లల హాజరు, వారికి ఇచ్చే అల్పాహారం, వేడి భోజనం, పాలు, గుడ్ల పంపిణీ వివరాలను నమోదు చేయాలి. వీటితో పాటు గర్భిణులు, బాలింతల రిజిస్ట్రేషన్, పిల్లల ఎత్తు, బరువు, వాక్సిన్ ల షెడ్యూల్, విటమిన్ -ఏ డోసులు, హెల్త్ చెకప్ప్ వివరాలు, హోమ్ విజిట్స్, బాలామృతం పంపిణీ వంటి సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌ లైన్‌ లో ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. కొత్త ఫోన్లు వస్తే ఈ డేటా ఎంట్రీ పనులు మరింత వేగంగా, సులభంగా జరుగుతాయని టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.