పనిచేయించుకుంటున్రు... పైసలిస్తలేరు

పనిచేయించుకుంటున్రు... పైసలిస్తలేరు
  • పనిచేయించుకుంటున్రు... పైసలిస్తలేరు
  • గ్రేటర్‌‌ వరంగల్‌‌లో స్వచ్ఛ భారత్‌‌ డ్రైవర్ల వెట్టి చాకిరి
  • డిసెంబర్‌‌తో ముగిసిన కాంట్రాక్ట్‌‌ గడువు 
  • జీతాలు ఆపేసిన ఆఫీసర్లు
  • రెన్యూవల్‌‌కు ప్రపోజల్స్‌‌ పంపినా స్పందించిన సర్కార్‌‌

వరంగల్‍, వెలుగు :  గ్రేటర్‌‌ వరంగల్‌‌ కార్పొరేషన్‌‌ పరిధిలో పనిచేస్తున్న స్వచ్ఛభారత్‌‌ డ్రైవర్‌‌ కమ్‌‌ ఓనర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఐదేళ్లుగా ఇంటింటికీ తిరిగి చెత్త సేకరిస్తున్న వారి కాంట్రాక్ట్‌‌ గడువు ముగిసినప్పటికీ తిరిగి రెన్యూవల్‌‌ చేయకుండానే పనిచేయించుకుంటున్న గ్రేటర్‌‌ ఆఫీసర్లు.. జీతాలు మాత్రం ఇవ్వడం లేదు. ఇదేమని అడిగితే వెహికల్స్‌‌ అప్పగించి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. 

గ్రేటర్‌‌ పరిధిలో 162 మంది

స్వచ్ఛ భారత్‌‌ స్కీంలో భాగంగా గ్రేటర్‌‌ వరంగల్‌‌ కార్పొరేషన్‌‌కు ఆటో ట్రాలీలను మంజూరు చేసిన కేంద్రం వాటి మెయింటెనెన్స్‌‌ను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. అర్హులైన 162 మందిని ఎంపిక చేసిన ఆఫీసర్లు ఆటోలను వారికి అప్పగించారు. భవిష్యత్‌‌లో ఉద్యోగ భద్రత సైతం కల్పించనున్నట్లు మాటిచ్చారు. వీరి తరఫున ప్రభుత్వమే నెల నెలా బ్యాంకుల్లో ఈఎంఐలు కట్టింది. స్వచ్ఛ డ్రైవర్ కమ్‍ ఓనర్ పద్ధతిలో 2017 నుంచి వీరు పనిచేస్తున్నారు. వీరి కాంట్రాక్టర్‌‌ గడువు గతేడాది డిసెంబర్‌‌తో ముగిసింది.

మొదట్లో ఇంటికి రూ.60 వసూలు 

స్వచ్ఛభారత్‌‌ ఆటో డ్రైవర్లకు మొదట్లో జీతాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో వీరి గౌరవ వేతనం, ఆటోల డీజిల్‌‌, ఇతర మెయింటెనెన్స్‌‌ కోసం ఒక్కో ఇంటి నుంచి రూ.60 చొప్పున వసూలు చేసుకోవాలని సూచించారు. మొదట్లో చెత్త సేకరణకు వీరి వెంట ఇతర సిబ్బందిని పంపించిన ఆఫీసర్లు తర్వాత వారిని తొలగించారు. దీంతో డ్రైవర్లే వర్కర్లుగా మారాల్సి వచ్చింది. ఇంత చేసినా ప్రజల నుంచి పెద్దగా పైసలు వసూలు కాకపోవడంతో తమకు సైతం ఇతర ఔట్‌‌ సోర్సింగ్‌‌ ఎంప్లాయీస్‌‌ మాదిరిగా జీతం, డీజిల్‍, వెహికల్‌‌ మెయింటెనెన్స్‌‌ చార్జీలు ఇప్పించాలని మేయర్‍, ఎమ్మెల్యేలు, కమిషనర్‌‌ను కోరారు.

రూ.15 వేల జీతం ఇస్తూ తీర్మానం

స్వచ్ఛ భారత్‌‌ డ్రైవర్లకు హైదరాబాద్‌‌ తరహాలో జీతాలు ఇవ్వాలని 2021 డిసెంబర్‌‌ 15న గ్రేటర్‌‌ వరంగల్‌‌ పాలకమండలి సభ్యులు తీర్మానం చేశారు. ప్రజల నుంచి శానిటేషన్‌‌ పన్ను వసూలు చేసి డ్రైవర్లకు నెలకు రూ. 15 వేల జీతంతో పాటు, వెహికల్‌‌ డీజిల్‌‌, మెయింటెనెన్స్‌‌ కింద మరో రూ. 15 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. డ్రైవర్ల కాంట్రాక్ట్‌‌ గడువు డిసెంబర్‌‌తో ముగిసింది. అప్పటివరకు జీతాలు ఇచ్చిన ఆఫీసర్లు ఆ తర్వాత వారిని పట్టించుకోవడం మానేశారు. 

జీతాలడిగితే ఆటోలిచ్చి పొమ్మంటున్రు 

ఐదేండ్లుగా పనిచేస్తుండడంతో తమను కాంట్రాక్ట్‌‌ ఎంప్లాయిస్‍గా గుర్తిస్తారని డ్రైవర్లు ఆశతో ఉన్నారు. అయితే డిసెంబర్‌‌తో గడువు పూర్తైందని, జీతాలు ఇవ్వలేమంటూ షాక్‌‌ ఇచ్చారు. దీంతో డ్రైవర్లంతా కలిసి ఎమ్మెల్యేలు, మేయర్‍, కమిషనర్‌‌ను కలవడంతో కాంట్రాక్ట్‌‌ గడువు పెంచడం గానీ, ఔట్‌‌ సోర్సింగ్‌‌ ఎంప్లాయీస్‌‌గా గానీ గుర్తించేందుకు చర్యలు చేపడుతామని చెప్పడంతో డ్రైవర్లు విధులకు హాజరవుతున్నారు. నాలుగు నెలలుగా డ్యూటీ చేస్తున్నా జీతాలు రాకపోవడంతో ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లను కలిస్తే తామేమీ చేయలేమని, వెహికల్స్‌‌ ఇచ్చేసి వెళ్లిపోవాలని తెగేసి చెప్పారు. దీంతో డ్రైవర్లు గందరగోళంలో పడ్డారు. ప్రభుత్వం స్పందించి తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు చేసిన పనికి జీతం చెల్లించాలని డ్రైవర్లు కోరుతున్నారు.

గవర్నమెంట్‍ అప్రూవల్‍ కావాలె 

స్వచ్ఛ భారత్‍ స్కీం కింద డ్రైవర్లను ఐదేండ్ల కోసం తీసుకున్నాం. డిసెంబర్‌‌తో చాలా మంది గడువు ముగిసింది. తమను ఔట్‌‌ సోర్సింగ్‌‌ ఎంప్లాయీస్‌‌గా గుర్తించాలని డ్రైవర్లు కోరుతున్నారు. అగ్రిమెంట్‌‌ రెన్యూవల్‍ కోసం ప్రభుత్వానికి రిక్వెస్ట్‌‌ పెట్టాం. ప్రభుత్వం అప్రూవల్‌‌ కోసం ఎదురుచూస్తున్నాం.
– రాజేశ్‍, బల్దియా సీఎంహెచ్‌‌వో