ఉత్సవాల పేరుతో పాలన బంద్

ఉత్సవాల పేరుతో పాలన బంద్

 

  • ఉత్సవాల పేరుతో పాలన బంద్
  • మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ దశాబ్ది వేడుకల్లో బిజీ 
  • గవర్నమెంట్ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు ఖాళీ 
  • కొన్ని జిల్లాల్లో ప్రజావాణి రద్దు 
  • సమస్యలతో ఇబ్బందులు పడుతున్న జనం 
  • ఎవరేం అడిగినా ఉత్సవాల తర్వాతే అంటున్న ఆఫీసర్లు 

హైదరాబాద్/వరంగల్‍, వెలుగు:  రాష్ట్రంలో పాలన ఆగిపోయింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, సెక్రటేరియెట్ లో పనిచేసే ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు మొదలు గ్రామాల్లో పనిచేసే సిబ్బంది వరకు అందరూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో బిజీ అయిపోయారు. దీంతో జనాల గోడు పట్టించుకునేవారే కరువయ్యారు. ఇటు సెక్రటేరియెట్​కు వస్తే సంబంధిత శాఖల సెక్రటరీలు ఉండట్లేదు. అటు జిల్లాల్లో కలెక్టర్లను కలుద్దామంటే ఈ నెల 22దాకా అర్జీలు తీసుకునే పరిస్థితి లేదంటున్నారు. అన్ని ఆఫీసుల్లో ఫైల్స్ పక్కన పెట్టేశారు. ధరణిలో వస్తున్న అప్లికేషన్లను మే 30వ తేదీ నుంచే చూడటం మానేశారు. ఇక ప్రతి సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణిని కొన్ని జిల్లాలో రద్దు చేశారు. పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా హెడ్‍క్వార్టర్స్​లో నడిచే గ్రీవెన్స్ లను కూడా బంజేశారు. ఉత్సవాలు జరిగే మూడు వారాల పాటు ప్రజావాణి ఉండదని కొన్ని జిల్లాల్లో సమాచారం ఇవ్వగా, మరికొన్ని జిల్లాల్లో మాత్రం ఆఫీసుల్లో పోస్టర్లు అంటించి వదిలేశారు. అది తెలియక ఆఫీసులకు వెళ్లిన జనం.. తిరిగి నిరాశతో ఇంటి బాటపడుతున్నారు. 

సోమవారం హైదరాబాద్​, మేడ్చల్​మల్కాజ్​గిరి, వికారాబాద్, మహబూబ్​నగర్, జోగులాంబ గద్వాల, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి, కామారెడ్డి, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్, జనగామ, భూపాలపల్లి జిల్లాల్లో ప్రజావాణి నిర్వహించలేదు. మిగిలిన జిల్లాల్లో కూడా నామమాత్రంగా నిర్వహించారు. కాగా, దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని.. ప్రతి ఒక్కరూ హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. లేదంటే వేటు తప్పదని హెచ్చరించింది. దీంతో మంత్రులు దగ్గరి నుంచి కింది స్థాయి అధికారుల వరకు అందరూ ప్రభుత్వ పెద్దలను మెప్పించేందుకు వేడుకల నిర్వహణకే పరిమితమైపోయారు. ఇంకో 15 రోజులు పరిస్థితి ఇట్లనే ఉండనుంది. 

అన్ని శాఖల పనులు పక్కకు.. 

వర్షాకాలం దగ్గర పడ్డది. జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల్లో నాలాల పూడీకతీత తదితర పనులు చేయాల్సి ఉన్నది. వరద నివారణకు చర్యలు చేపట్టాల్సి ఉన్నది. మరికొన్ని రోజుల్లో అకడమిక్ ఇయర్ ప్రారంభమవుతుంది. ఈ టైమ్ లో ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ కు మస్తు పని ఉంటుంది. బడి బాట నిర్వహించాల్సి ఉన్నది. ఇక ఇది సీజనల్ వ్యాధులు ప్రబలే టైమ్ కాబట్టి హెల్త్​ డిపార్ట్​మెంట్ ముందస్తు కార్యాచరణ అమలు చేయాల్సి ఉన్నది. వానలు మొదలైతే రైతులు సాగు బాట పడ్తారు. వ్యవసాయ శాఖ విత్తనాలు, ఎరువులు, పంటలపై రైతులకు అవగాహన కల్పించాల్సి ఉన్నది. కానీ ఇప్పుడీ శాఖల అధికారులు ఉత్సవాల్లో బిజీ అయిపోయారు. తమ శాఖ పనులన్నీ పక్కన పెట్టారు. 

వడ్లు కొనుగోళ్లపై ఎఫెక్ట్

ఈ ఏడాది యాసంగి సీజన్ పూర్తయింది. మరో వారంలో వర్షాలు పడే అవకాశం ఉంది. కానీ ఇంకా చాలాచోట్ల వడ్ల కొనుగోళ్లు పూర్తి కాలేదు. వడ్లు కొనడం లేదని, తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని రైతులు రోడ్కెక్కి ధర్నాలు చేస్తున్నారు. సర్కార్ ఇవేవీ పట్టించుకోకుండా ఆఖరుకు సివిల్ సప్లయ్స్ ఆఫీసర్లను కూడా దశాబ్ది ఉత్సవాల్లో భాగం చేసింది. సంబంధిత మంత్రి దగ్గర నుంచి కమిషనర్, ఇతర అధికారులు అందరూ దశాబ్ది ఉత్సవాలపైనే ఫోకస్ పెట్టారు. 

ఆఫీసులన్నీ ఖాళీ.. 
 
సెక్రటేరియెట్ మొదలు జిల్లా ఆఫీసుల వరకు అధికారులు అందుబాటులో ఉండడం లేదు. అందరూ ఉత్సవాల పనుల్లోనే బిజీగా తిరుగుతున్నారు. ఆఫీసుల్లో కొంతమంది ఉన్నా, వాళ్లూ ఉత్సవాల పనులే చేస్తున్నారు. బాధలు చెప్పుకోవడానికి జనం వస్తే తిప్పి పంపుతున్నారు. దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్ల కోసమని అంతకుముందు వారం రోజులు కూడా అధికారులు బిజీగానే ఉన్నారు. రైతు దినోత్సవం, పోలీసుల సురక్షా దినోత్సవం, విద్యుత్తు దినోత్సవం..ఇలా రోజుకో దినోత్సవం పేరిట ఈ నెల 22 వరకు వేడుకలు నిర్వహించాలని సర్కార్ ఆదేశించడంతో అధికారులు రెగ్యులర్‍ డ్యూటీలకు దూరంగా ఉంటున్నారు. చివరికి పోలీస్ స్టేషన్లు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ ఉత్సవాలు జరుగుతుండడంతో బందోబస్తు, ట్రాఫిక్ విధులతో సిబ్బంది బిజీ అయిపోయారు. దీంతో మరీ పెద్ద కేసు అయితే తప్ప.. పోలీస్ సిబ్బంది ఘటన జరిగిన ప్రాంతాలకు వెళ్లలేని దుస్థితి నెలకొంది. పెండింగ్‍ కేసులు ఏమున్నా ఉత్సవాల తర్వాతే క్లియర్‍ చేస్తామంటున్నారు. 

లీడర్లూ దొర్కుతలేరు.. 

మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు లీడర్లెవరూ జనాలకు అందుబాటులో ఉండడం లేదు. క్యాంప్ ఆఫీసులకు జనం పోతే ఉత్సవాల తర్వాతే రావాలని లీడర్ల పీఏలు చెబుతున్నారు. దీంతో జనం దశాబ్ది మీటింగ్ ల దగ్గరికి పోతున్నారు. కనీసం అట్లయినా ఎమ్మెల్యే కలుస్తడని ఆశతో వెళ్తున్నరు. కానీ ప్రోగ్రామ్​లు జరిగే దగ్గరకు వెళ్లి ఎవరైనా వినతి పత్రం ఇస్తే, సమస్యలు చెబితే ఎమ్మెల్యేలు విసుక్కుంటున్నారు. ‘ఉత్సవాల దగ్గర ఏం చెప్తున్నరు ? ఇప్పుడు కాదు ఇంకో 15–20 రోజుల తరువాత చుద్దాం’ అంటూ దబాయించి వెనక్కి పంపుతున్నారు. రాష్ట్రంలో కల్యాణ లక్ష్మీ చెక్కుల కోసం ఎమ్మెల్యేల ఆమోదం తప్పనిసరి. చెక్కులు వచ్చిన తరువాత కూడా ఎమ్మెల్యేలే పంచుతారు. అయితే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా ఇప్పుడు ఉత్సవాల్లో బీజీ కావడంతో అవన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి.

ఎన్ని రోజులు చేస్తరు ఉత్సవాలు? 

భూమి సమస్య, డబుల్‍ బెడ్‍ రూం ఇండ్లు, ఫించన్ల కోసం మా ఊరి నుంచి నలుగురైదుగురం డైరెక్ట్ ఆటో మాట్లాడుకుని వచ్చినం. ఇక్కడికొచ్చినంక చూస్తే ఉత్సవాలు అయిపోయేవరకు ప్రజావాణి లేదని అంటున్రు. ఉత్సవాలు చేస్కొంగా వద్దంటలేం. కానీ జనాలకొచ్చే సమస్యలు ఉత్సవాల పేరుజెప్పి ఆగుతయా. పండుగైనా, పబ్బమైనా ఏదో ఒకట్రెండు రోజులు చేస్కొవాలే. తర్వాత పనులు చేస్కొవాలే కదా. ఆఫీసర్లు జర ఆలోచన చేయాలే.

- రాజన్న, సమ్మయ్య, లక్ష్మి 
(నల్లబెల్లి, వరంగల్) 

ఎన్నిసార్ల తిరగాలె.. 

కల్యాణలక్ష్మి కోసం వచ్చిన. పోయిన సోమవారం వస్తే ప్రజావాణి క్యాన్సల్‍ అయిందని ఈ వారం రమ్మన్నరు. పనులన్నీ బంద్‍ చేస్కొని అంతదూరం నుంచి వచ్చాక ఇప్పుడు మళ్లీ బంద్‍ అంటున్నారు. దశాబ్ది ఉత్సవాలు ఉన్నయ్‍ కాబట్టి వచ్చే మూడు వారాలు కూడా ఉంటదో ఉండదో చెప్పలేం అంటున్రు. ఇట్లయితే ఇప్పట్లో మా సమస్యలకు పరిష్కారం దొరకదు.  
-రమేశ్‍, సంగెం మండలం, వరంగల్‍