డిజిటల్​ క్లాసులకు దూరంగా సర్కారు బడి స్టూడెంట్లు

డిజిటల్​ క్లాసులకు దూరంగా సర్కారు బడి స్టూడెంట్లు

టీవీ బడి బంజేసి పొలం పనులకు..
డిజిటల్​ క్లాసులకు దూరంగా సర్కారు బడి స్టూడెంట్లు
అక్కడక్కడ నైన్త్​, టెన్తోళ్లు​ తప్ప ఎవరూ వింటలేరు
రూరల్ ఏరియాల్లో పత్తి  ఏర, బర్లు గొర్లు కాయపోతున్నరు
ఆఫీసర్లు, టీచర్లు, పేరెంట్స్​పట్టించుకుంట లేరు

నెట్వర్క్, వెలుగు:  కరోనా కారణంగా సెప్టెంబర్​1 నుంచి  స్టేట్​వైడ్​ మొదలైన డిజిటల్​ క్లాసులు సర్కారు బడి స్టూడెంట్ల విషయంలో సక్సెస్​ కావట్లేదు. క్లాసుల నిర్వహణపై విద్యాశాఖ ఆఫీసర్లు మొదట్లో చూపిన శ్రద్ధ ఇప్పుడు చూపట్లేదు. టీచర్లు సైతం సీరియస్​గా తీసుకోకపోవడంతో నైన్త్​, టెన్త్​ స్టూడెంట్లు తప్ప మిగిలిన పిల్లలంతా టీవీ బడికి దూరమయ్యారు. ముఖ్యంగా రూరల్​ ఏరియాల్లో పెద్ద పిల్లలు పేరెంట్స్​తో కలిసి పొలం పనులకు పోతున్నరు. సీజన్​కావడంతో పత్తి ఏరుతూ, బర్లు, గొర్లు, మేకలు మేపుతూ కనిపిస్తున్నరు. కొందరైతే సుతారుల కింద తట్టపనికి పోతున్నరు. ప్రైమరీ స్కూలు పిల్లలైతే ఇండ్ల వద్దే ఆటపాటల్లో మునిగితేలుతున్నరు.

టీవీలు లేక.. ఉన్నచోట పర్యవేక్షణ లేక..

యాదగిరి, టీశాట్​చానళ్లలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 వరకు  డిజిటల్​క్లాసులు జరుగుతున్నా రూరల్ ఏరియాల్లో పిల్లలు వింటలేరు. ఈ విషయాన్ని స్వయంగా టీచర్లే చెబుతున్నారు. స్టేట్​వైడ్​ సుమారు 25 వేల బళ్లలో 17.18లక్షల మంది స్టూడెంట్స్​ చదువుతుండగా, విద్యాశాఖ చేసిన సర్వే ప్రకారం వీరిలో 2లక్షల మంది ఇండ్లలో అసలు టీవీలే లేవు. అలాంటివారికి మొదట్లో ఇతరుల ఇండ్లలో, గ్రామపంచాయతీల్లో కూర్చోబెట్టి పాఠాలు వినేలా చూసిన టీచర్లు, ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. పిల్లలు కూడా తమకు టీవీపాఠాలు అర్థమవుతలేవని, డౌట్స్​ వస్తే ఎవరూ క్లియర్​ చేస్తలేరని చెబుతూ ఒక్కొక్కరే మానేస్తున్నారు. టీచర్ల ఒత్తిడితో నైన్త్​, టెన్త్​​ స్టూడెంట్లు మాత్రమే అక్కడక్కడ క్లాసులకు అటెండ్​ అవుతున్నారు. వాళ్లకు కూడా ఇప్పటికి 30శాతం మాత్రమే సిలబస్​ అయిందని టీచర్లు చెబుతున్నారు.

గతేడాదిలాగే ప్రమోట్​ చేస్తారని..

నిరుటి లాగానే ఈ సారి కూడా ఎగ్జామ్స్​ పెట్టకుండా పైక్లాసులకు ప్రమోట్​ చేస్తారని ఎక్కువ మంది పేరెంట్స్​ అనుకుంటున్నారు. పిల్లలు కూడా అదే భావనతో డిజిటల్​ క్లాసులపై ఇంట్రస్ట్​ చూపడంలేదు. దీనికితోడు పల్లెల్లో కరెంట్, సిగ్నల్స్​ సమస్యలు ఉండనే ఉన్నాయి. ఇదే టైంలో దసరా తర్వాత పొలం పనులు స్టార్ట్​ అయ్యాయి. దీంతో ఆన్​లైన్​ క్లాసులకు హాజరయ్యే వారి సంఖ్య  క్రమంగా తగ్గిపోయింది. వాట్సప్​ గ్రూపులు కూడా ఇన్​యాక్టివ్​ అయ్యాయి. సూర్యాపేట జిల్లాలో టీవీ క్లాసులకు12వేల కు పైగా వ్యూస్​ వస్తే  గత నెల రోజుల నుంచి వెయ్యి వ్యూస్​ కూడా రావడం లేదని ఆఫీసర్లు అంటున్నారు. ఇక స్టేట్​వైడ్​10 లక్షల మందికి పైగా  స్టూడెంట్లకు ఫోన్లలో నెట్​ఫెసిలిటీ లేదు. దీంతో వర్క్​షీట్లను డౌన్​లోడ్​ చేసుకోలేకపోతున్నారు. పోనీ ప్రింట్, జీరాక్స్​​ తీసి ఇద్దామంటే సర్కారు నుంచి పైసా రావడం లేదని టీచర్లు అంటున్నారు. బడి లేకపోవడంతో పేదకుటుంబాల్లోని తల్లిదండ్రులు కాస్త పెద్ద పిల్లలను పత్తి ఏర.., గొర్లు, బర్లు కాయ, తట్టపనికి తీసుకుపోతున్నరు. పెద్దవాళ్లంతా పనికిపోయిన చోట్ల చిన్న పిల్లలు ఇండ్ల వద్ద ఆడుకుంటూ కనిపిస్తున్నరు. దీంతో సొంత ఖర్చుతో జిరాక్సులు తీసి పట్టుకపోయిన వర్క్​షీట్లను ఎవరికి ఇవ్వాలో తెలియక టీచర్లు వెనుదిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది టీచర్లు పర్యవేక్షణ కూడా మానేసి, విడతలవారీగా స్కూలుకు వెళ్లి డ్యూటీ టైం కాగానే ఇంటిముఖం పడుతున్నారు.

వర్క్ షీట్స్ ఇవ్వలేకపోతున్నం..

ఆన్​లైన్​ క్లాసులు  9 ,10 క్లాసుల పిల్లలకు మాత్రమే కొంతమేర ఉపయోగపడుతున్నాయి. పేరెంట్స్​ పర్యవేక్షణ లేక పిల్లలు టీవీలో వచ్చే క్లాసులు వినట్లేదు. పొలం పనులతో  పేరెంట్స్ శ్రద్ధ పెడ్తలేరు. పిల్లల్ని పనులకు తీసుకపోతున్నరు. స్మార్ట్​ఫోన్లు లేక వర్క్ ఫీట్స్ డౌన్లోడ్ చేసుకుంటలేరు. వర్క్ షీట్లు పంపించేందుకు సర్కారు పైసలియ్యట్లే.

– తాండూరి సతీష్ గౌడ్,ప్రధానోపాధ్యాయులు, కోరుట్ల

సక్సెస్ కాలె

ఆన్​లైన్ క్లాసులు అనుకున్నట్టు  సక్సెస్​ కాలేదు. 9, 10  స్టూడెంట్స్ వరకు ఫర్వాలేదు.  కానీ 6, 7,8  స్టూడెంట్స్ శ్రద్ద పెడ్తలేరు. టీవీల్లో క్లాసులు వింటున్నప్పుడు కరెంట్ పోయి ఇబ్బంది పడుతున్నారు. టెన్త్​  సిలబస్ 30 శాతం కంప్లీట్ చేసినం.  ఈసారి సిలబస్​ 7‌0 శాతం తగ్గిచ్చిన్రు. మరింత తగ్గిస్తే బాగుంటుంది. – జయరాజ్,. హెచ్ ఎం, జెడ్పీ హై స్కూల్, బాబాసాగర్, చింతలమానే పల్లి మండలం

పొలం పనికి తీసుకపోతున్న

ఆన్​లైన్​ క్లాసులు పిల్లలకు అర్థమైతలేవు. ఏ టైముకు వస్తున్నయో తెలుస్తలేదు. తొమ్మిదవ తరగతి చదువుతున్న నా కొడుకుకు ఏమీ సమజైతలేదట. దీంతో క్లాసులు వినకుండా ఇంటి దగ్గర ఖాళీగా ఆటలాడుకుంట తిరుగుతున్నడు. అందుకే నాతోని పొలం  పనికి తీసుకొని వెళ్తున్నా. – గాజుల వెంకటేశ్వర్లు, స్టూడెంట్ తండ్రి, కూరెళ్ళ, సిద్దిపేట జిల్లా

వేరే భాషలో వస్తున్నయి

మా డాడీ పెట్రోల్ బంక్ లో పనిచేస్తడు. ఆయన డ్యూటీకి పోయినప్పడు మొబైల్​లో క్లాసులు వినలేకపోతున్న.  టీవీలో పొద్దున10 నుంచి 2గంటల దాక వింటున్న. టీవీల్లో ఉర్దూ, ఇతర భాషల్లో వస్తున్న లెసెన్స్ అర్థం కావట్లే. ఏ టైమ్​లో లెసన్స్​ వస్తాయో టైమ్​ టేబుల్​ ఎవరూ చెప్పట్లే. వాట్సప్ గ్రూపులో వచ్చే వర్క్ షీట్స్ రాసి పంపిస్తున్నాం.  – పంతంగి మనస్విని, 7వ తరగతి చొప్పదండి

ఈ ఫోటోలో కనిపిస్తున్న స్టూడెంట్ పేరు సేరి దర్శన్. ఇతనిది సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం చాప్టా (కే గ్రామం. గవర్నమెంట్​ స్కూళ్లో ఫిప్త్​  క్లాస్ చదువుతున్నడు. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా ఆన్ లైన్ క్లాస్ వినలేదు. ఇంట్లో టీవీ లేదు. స్కూల్ లో కూడా టీవీ ఏర్పాటు చేయలేదు. ఆన్ లైన్ క్లాసుల గురించి టీచర్లు చెప్పలేదని దర్శన్ అంటున్నడు. ఇతని పేరెంట్స్  కూడా ఆన్ లైన్ క్లాసుల సంగతి తమకు తెలవదని అంటున్నరు. ఇప్పటివరకు ఏ టీచర్ ఇంటికి రాలేదని చెప్తున్నారు.

ఈ అబ్బాయి పేరు రంజిత్. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కాటారంలోని ప్రైవేట్​ స్కూల్​లో 4వ తరగతి చదువుతున్నాడు. మొదట్లో టీవీ లో క్లాసులు విన్నాడు. కానీ ఎంతకీ పాఠాలు అర్థం కాకపోవడంతో వినడం మానేశాడు.  ప్రస్తుతం తల్లిదండ్రులకు  కూలీపనుల్లో సహాయం చేస్తున్నాడు. బడులు మొదలైతే మల్ల బడికి పోతాను అంటున్నాడు.