బడులకు పోవాల్నా? వద్దా ?: సర్కారీ టీచర్ల అయోమయం

బడులకు పోవాల్నా? వద్దా ?: సర్కారీ టీచర్ల అయోమయం

స్కూళ్లకు రావాలంటూ డీఈఓల ఆదేశాలు
డైరెక్టరేట్ నుంచి ఇప్పటికీ రాని ఉత్తర్వులు
ఒకవేళ బడికెళ్లినా ఏం చేయాలనే దానిపై స్పష్టత కరువు

హైదరాబాద్, వెలుగు: బడులకు వెళ్లాలా లేదా అనే అంశంపై సర్కారీ స్కూల్ టీచర్ల‌లో అయోమయం నెలకొంది. ఈనెల 20 నుంచి స్టూడెంట్లకు ఆన్ ల‌ప‌న్ లో పాఠాలు ప్రారంభిస్తామని, 17 నుంచి టీచర్లు బడులకు వెళ్లాల్సి ఉంటుందని ఈ మధ్య విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. కానీ అధికారికంగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్ట‌ర్ నుంచి ఇప్పటికీ ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో టీచర్ల‌లో గందరగోళం మొదలైంది.
సగం మంది చొప్పున బడులకు రావాలని..
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆన్‌‌లైన్‌లో క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణ‌యించింది. మంత్రి సబితారెడ్డి.. విద్యా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి, హైస్కూల్ స్టూడెంట్లకు ఈనెల 20 నుంచి దూరదర్శన్ యాదగిరి, టీశాట్ ద్వారా పాఠాలు మొదలు పెట్టాలని ఆదేశించారు. స్టూడెంట్లను మానిటర్ చేసేందుకు, ఇతర పనులకు ఈ నెల 17 నుంచి స్కూల్‌ లోని టీచర్ల‌లో సగం మంది బడులకు రావాలని సూచించారు. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్ట‌ర్ శ్రీదేవసేన..డీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. త్వరలో ఉత్తర్వులు వస్తాయని, టీచర్లందరినీ అలర్ట్ చేయాలని సూచించారు. దీంతో డీఈఓలంతా హెడ్‌‌మాస్టర్ల‌తో వీడియో కాన్ఫరెన్సు లు నిర్వహించి, ఈ నెల 17 నుంచి టీచర్లు బడులకు వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. కొందరు డీఈఓలు ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

ఉత్తర్వుల్లేక అయోమయం
సోమవారం నుంచి టీచర్లు బడులకు పోతే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏఏ పనులు చేయాలి? అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఆదివారం రాత్రి దాకా హెడ్‌‌మాస్టర్లు, టీచర్లు ఉన్నతాధికారులకు ఫోన్లు చేసినా స్పష్టత కరువైంది. పలువురు టీచర్ ఎమ్మెల్సీలు మంత్రి సబితతో మాట్లాడితే.. టీచర్లు బడులకు వెళ్లే అంశంపై ఈనెల 20న స్పష్టత ఇస్తామని చెప్పినట్టు తెలిసింది. వీడియో కాన్ఫరెన్స్ పెట్టి, బడులకు రావాలని చెప్పిన అధికారులు ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని టీచర్లంతా మండిపడుతున్నారు.

ఆన్లైన్ క్లాసులపైనా సందిగ్ధం

ఈనెల 20 నుంచి హైస్కూల్ స్టూడెంట్లకు జరగాల్సిన ఆన్ లైన్ క్లాసులపైనా సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే ఈనెల 17 నుంచి జరగాల్సిన ఆన్ లైన్ క్లాసులు వాయిదా పడ్డాయి. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని అధికారులు చెప్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..