సర్కార్ స్కూళ్లకు ఇంగ్లిష్ మీడియం పర్మిషన్లు ఇస్తలేరు

సర్కార్ స్కూళ్లకు ఇంగ్లిష్ మీడియం పర్మిషన్లు ఇస్తలేరు

మూడేండ్లుగా పెండింగ్ లో పెట్టిన స్కూల్ ఎడ్యుకేషన్
ఆందోళనలో 65 స్కూళ్ల స్టూడెంట్లు

హైదరాబాద్, వెలుగు: స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం అడిషనల్ క్లాసులకు పర్మిషన్ ఇస్తలేరు. జిల్లాల నుంచి వచ్చిన ప్రపోజల్స్ ను మూడేండ్లుగా పెండింగ్ లో పెట్టారు. దీంతో ఆయా స్కూళ్లలో చదువుతున్న స్టూడెంట్లు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఐదారేండ్ల కింద చాలా ప్రైమరీ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం క్లాసులు ప్రారంభించారు. ఆ తర్వాత ఆ స్కూళ్లను అప్ గ్రేడ్ చేసుకుంటూ 6, 7 తరగతుల్లోనూ ఇంగ్లిష్ మీడియానికి రీజనల్ జాయింట్ డైరెక్టర్లు (ఆర్జేడీ) పర్మిషన్ ఇచ్చారు. అయితే 8,9,10 తరగతుల్లో ఇంగ్లిష్ మీడియం సెక్షన్లకు సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్​ డైరెక్టరేట్ అనుమతులు ఇవ్వాల్సి ఉంది. 7వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం పర్మిషన్లు ఉన్న స్కూళ్లు… ఆపై తరగతులకు పర్మిషన్లు ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్​కు ప్రపోజల్స్ పంపాయి.

ఇట్ల 2018–19, 2019–20, 2020–21 అకడమిక్ ఇయర్స్ లో పంపిన ప్రపోజల్స్ అన్నింటినీ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు పెండింగ్ లో పెట్టారు. దాదాపు 65 స్కూళ్లకు సంబంధించిన అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా స్కూళ్లలో 2017లో ఏడో తరగతి పూర్తి చేసిన స్టూడెంట్లు… ఇప్పుడు పదో తరగతిలో ఉన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఇంగ్లిష్ మీడియం అనుమతులు వస్తేనే వారందరికీ హాల్​టికెట్లు వచ్చే అవకాశముంది. దీంతో ఆయా స్కూళ్లలో చదువుతున్న వందలాది మంది స్టూడెంట్లు​ఆందోళన చెందుతున్నారు. ఇంగ్లిష్ మీడియం అడిషనల్ సెక్షన్లకు పర్మిషన్ ఇవ్వాలని గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం తరపున విన్నవించామని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పర్మిషన్లు ఇవ్వాలని ఆయన కోరారు.