
- వసతులులేకే పేరెంట్స్ ప్రైవేట్ వైపు చూస్తున్నరు: ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ను తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నామని, సర్కారు స్కూళ్లను మరింత బలోపేతం చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి అన్నారు. అయితే, ఈ స్కూల్స్ నిర్మాణానికి ఎన్నేండ్లు పడుతుందోనని అనుమానం వ్యక్తం చేశారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ సర్వీసులు సరిగ్గా లేనప్పుడు ప్రైవేట్ వైపు ప్రజలు చూస్తారన్నారు.
ప్రజలకు మధ్య అంతర్యాలు పెరిగితే అరాచకాలు పెరుగుతాయన్నారు. నాణ్యమైన విద్య, వైద్యం లేకపోతే సమాజం అభివృద్ధి సాధించడం అసాధ్యమన్నారు. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయొద్దని స్పష్టంచేశారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు, టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. సరైన సమయంలో జీతాలు చెల్లించడం లేదన్నారు. సర్కారు స్కూళ్లలో చదువుతున్న పిల్లలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని ఏవీఎన్ రెడ్డి డిమాండ్ చేశారు.