
హైదరాబాద్, వెలుగు: రెగ్యులర్ డీజీపీ పోస్టు కోసం యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ)కు ప్రభుత్వం ఎనిమిది మంది ఐపీఎస్‌ల పేర్లను పంపింది. ఇందులో ప్రస్తుత డీజీపీ జితేందర్‌తో పాటు ప్రస్తుత హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా, హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి, అప్టే వినయ్ ప్రభాకర్ (సెంట్రల్ డిప్యూటేషన్), జైళ్ల శాఖ డీజీ సౌమ్యామిశ్రా, సీఐడీ డీజీ షికా గోయల్‌కు, విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పేర్లను ప్రతిపాదించారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. పూర్తిస్థాయి డీజీపీ పదవికి కనీసం 30 ఏండ్ల సర్వీసు, డీజీ హోదాలో పనిచేసిన అనుభవం వంటి అర్హత లుండాలి. ఆరు నెలల కనీస సర్వీసు ఉన్న వాళ్ల పేర్లు మాత్రమే పంపాలి. అయితే ఇందులో ప్రస్తుత డీజీపీ జితేందర్, శ్రీనివాస్‌రెడ్డికి ఆరు నెలల సర్వీసు లేదు. దీంతో ఆ పేర్లను యూపీఎస్సీ వెనక్కి పంపించినట్లు సమాచారం. ఇద్దరి పేర్లను తొలగించి మళ్లీ లిస్ట్‌ను పంపనున్నట్లు తెలుస్తున్నది.