
- సప్లై సరిగా లేక అవస్థలు
- మేనేజ్ చేస్తున్న ఆఫీసర్లు
- గజ్వేల్, హబ్సీపూర్ లో రాస్తారోకో
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలో యూరియా కొరత రైతులకు ఆందోళనకు గురిచేస్తోంది. వర్షాలు పడుతుండడంతో యూరియా కోసం రైతులు పీఎసీఎస్ లు, ఫర్టిలైజర్ షాపుల వద్ద బారులు తీరుతున్నారు. అవసరానికి తగ్గట్టు సప్లై జరగడంలేదు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కోరినంత యూరియా సరఫరా చేయకుండా కోత విధించడం సమస్యకు కారణమవుతోంది. చాలాచోట్ల యూరియా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. స్టాక్ వచ్చిన చోట ఒక్కో పాస్ బుక్కుకు ఒక యూరియా బస్తా ఇస్తూ సర్దుబాటు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పీఎసీఎస్ లకు స్టాక్ వస్తుందని తెలియగానే తెల్లవారుజాము నుంచే రైతులు క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల రద్దీ ఎక్కువగా ఉండడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
వానాకాలం సీజన్ లో జిల్లాలో 5.60 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేయగా ప్రస్తుతం మూడు లక్షల ఎకరాలకు పైగా సాగులోకి వచ్చింది. ఇందులో దాదాపు 2 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఇటీవల వర్షాలు కురుస్తుండటంతో యూరియాకు డిమాండ్ పెరిగింది. సమయానికి యూరియా దొరక్క రైతులు ఆందోళన చెందుతున్నారు. గురువారం దుబ్బాక మండలం హబ్సీపూర్, గజ్వేల్ లో రైతులు యూరియా కోసం రాస్తారోకో చేశారు.
వచ్చింది 13 వేల మెట్రిక్టన్నులే
వానాకాలం సీజన్ లో జిల్లాకు 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటి వరకు 13 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సప్లై అయ్యింది. ఆగస్టు నెలలో 13 వేల మెట్రిక్ టన్నులు అవసరంకాగా, కేవలం 5 మెట్రిక్ టన్నులే అందింది. అనుకున్న మేరకు స్టాక్రాకపోవడంతో అగ్రికల్చర్ ఆఫీసర్లు మేనేజ్ చేస్తున్నారు. యాసంగిలో వచ్చిన బఫర్ స్టాక్ 7 వేల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేశారు. ఒక్కో పాస్ బుక్కుకు ఒక్క బస్తా ఇవ్వడం ద్వారా అందరికీ యూరియా అందించే ప్రయత్నం చేస్తున్నారు.
ఆర్ఎఫ్ సీఎల్(రామగుండం ఫర్టిలైజర్ అండ్ కెమికల్ లిమిటెడ్), సీఐఎల్ వంటి కంపెనీల నుంచి వివిధ కారణాలతో అనుకున్నట్టు యూరియా సప్లై జరగకపోవడం కూడా సమస్య తీవ్రతను పెంచుతోందని అంటున్నారు. కాగా, పాయింట్ ఆఫ్ సేల్ ( పీఓఎస్) వద్ద రైతు వివరాలు నమోదు చేసేటప్పుడు సర్వర్ సమస్య వల్ల పంపిణీ లో జాప్యం జరుగుతోంది. ఏ మండలానికి చెందిన రైతులు అదే మండలంలో కొనుగోలు చేయాలన్న నిబంధన వల్ల రైతులు పడిగాపులు పడుతున్నారు. రైతుల ఆరాటాన్ని కొందరు ప్రైవేటు ఫర్టిలైజర్ షాపుల వారు క్యాష్ చేసుకుంటున్నారు. యూరియా కోసం వస్తే పురుగు మందులు కూడా కొనాలని షరతు పెడుతున్నారు.
రైతులు ఆందోళన చెందవద్దు
యూరియా గురించి రైతులు ఆందోళన చెందవద్దు. అవసరమైన మేరకు యూరియా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. యాసంగికి సంబంధించి అందుబాటులో వున్న 7వేల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ ను పంపిణీ చేశాం. ఇప్పటి వరకు జిల్లాలో 20 వేల మెట్రిక్ టన్నుల యూరియాను సప్లై చేశాం. - స్వరూపా రాణి, జిల్లా వ్యవసాయ అధికారి