
- సగమే నిండిన మీడియం ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు
- సాధారణ విస్తీర్ణంలో పత్తి, అంచనాలకు దూరంగా వరిసాగు
- భారీ వర్షాలపైనే అన్నదాతల ఆశలు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో వర్షాలు దోబూచులాడుతు న్నాయి. వానాకాలం మొదలై రెండు నెలలు గడిచినా ఆశించిన వర్షాలు పడకపోవడంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 13 నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పినప్పటికీ మూడు నాలుగు మండలాలకే వానలు పరిమితమయ్యాయి. ఇప్పటికీ జిల్లాలోని 13 మండలాల్లో లోటు వర్షపాతం నెలకొనడం వర్షాభావ పరిస్థితికి అద్దం పడుతోంది. జిల్లాలోని మీడియం ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటలు సైతం పూర్తిగా నిండలేదు. భూగర్భ జలాలు నిరుటికంటే మీటరు లోతు కిందనే ఉన్నాయి. ఫలితంగా పంటల సాగుపై ప్రభావం పడుతోంది.
లోటు వర్షపాతమే..
ఇప్పటివరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 483.2 మిల్లీమీటర్లకు గాను 607 మిల్లీమీటర్లు కురిసింది. మొత్తం18 మండలాలకు గాను తాండూర్, కాసిపేట, కన్నెపల్లి, బెల్లంపల్లి మండలాల్లో మాత్రమే నార్మల్ రెయిన్ ఫాల్ నమోదైంది. ఒక్క భీమిని మండలంలో ఎక్సెస్ వర్షం కురిసింది. కాసిపేటలో సాధారణ వర్షపాతం 568.1 మిల్లీమీటర్లకు గాను 544.7, తాండూర్లో 556.7కు 625.3, కన్నెపల్లిలో 621కు 710.2, బెల్లంపల్లిలో 569.2కు 652.6 నమోదు కాగా, భీమినిలో 610.8 మిల్లీమీటర్లకు 845.6 వర్షం కురిసింది. మిగతా 13 మండలాలు మంచిర్యాల, మందమర్రి, నస్పూర్, జైపూర్, భీమారం, చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి, నెన్నెల, హాజీపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారంలో 20 నుంచి 59 శాతం లోటు వర్షపాతం ఉంది.
సగమే నిండిన జలవనరులు
జిల్లాలో లోటు వర్షపాతం మూలంగా జలవనరులు సగమే నిండాయి. మీడియం ప్రాజెక్టులైన రాళ్లవాగు, గొల్లవాగు ఇంకా నిండలేదు. ఒక్క నీల్వాయి ప్రాజెక్టు మాత్రం గత రెండు రోజుల్లో కురిసిన భారీ వర్షానికి మత్తడి పోస్తోంది. జిల్లాల్లో చిన్న, పెద్ద కుంటలు కలిపి మొత్తం 624 ఉన్నాయి. వీటిలో 163 కుంటలు అలుగు పోస్తుండగా, 154 చెరువులు 75 నుంచి వంద శాతం నిండాయి. మరో 95 చెరువుల్లో
50 నుంచి 75 శాతం మాత్రమే నీళ్లు చేరాయి. 25 నుంచి 50 శాతం 131 కుంటలు నిండగా, 91 కుంటలు 25 శాతంతో వెలవెలపోతున్నాయి.
రైతుల ఆందోళన
జిల్లాలో ఆశించిన వర్షాలు పడకపోవడంతో పంటల సాగుపై రైతులు ఆందోళన చెందుతున్నారు. మీడియం ప్రాజెక్టులు, చెరువులు కూడా నిండకపోవడంతో ఆయకట్టు కింద వరిసాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ వానాకాలం సీజన్లో జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 3,18,638 ఎకరాలకు గాను, ఇప్పటివరకు 2,59,702 ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు వేశారు. ప్రధాన పంటలైన వరి 1,51,861 వేల ఎకరాలకు 98,298 ఎకరాల్లోనే సాగైంది. పత్తి 1,58,753 ఎకరాలకు 1,60,284 ఎకరాల్లో వేశారు. ఇక కంది, మొక్కజొన్న, పెసరతోపాటు ఇతర పంటలు నామమాత్రంగానే సాగయ్యాయి.