ఆరు నెలల్లో 5.61 లక్షల కొత్త రేషన్ కార్డులు..95.56 లక్షలకు చేరిన కార్డుల సంఖ్య

ఆరు నెలల్లో 5.61 లక్షల కొత్త రేషన్ కార్డులు..95.56 లక్షలకు చేరిన కార్డుల సంఖ్య
  • రేపటి నుంచి కార్డుల పంపిణీ షురూ
  • నల్గొండ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 14వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లయ్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్ ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ అంశం కోర్టులో ఉండడంతో.. ప్రస్తుతానికి కేవలం రేషన్ కార్డు మంజూరు పత్రాలు మాత్రమే అందజేయనున్నారు.

 జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించింది. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందించాలనే లక్ష్యంతో సర్కార్ చర్యలు చేపట్టింది.  గతంలో 89,95,282 రేషన్ కార్డులు ఉండగా.. గత ఆరు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 5,61,344 కార్డులు మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 95,56,625కు చేరింది. గతంలో 2,81,47,565 మంది లబ్ధిదారులు ఉండగా.. ఇప్పుడు 3,09,30,911 మందికి చేరారు. గతంలో ఉన్నవాటికి అదనంగా 27,83,346 మంది లబ్ధిదారులు తెల్లరేషన్ కార్డు పరిధిలో చేరారు. అంటే.. రాష్ట్రంలో దాదాపు 1.20 కోట్ల కుటుంబాల్లో దాదాపు 79.63 శాతం మందికి రేషన్ కార్డులు అందించింది. 

బీఆర్ఎస్ ఇచ్చింది కేవలం 45వేల కార్డులే..

జనవరి 26 నుంచి రేషన్ కార్డుల ప్రక్రియ మొదలైంది. మే 23వ తేదీ వరకు 2,03,156 కార్డులు మంజూరు చేసింది. సీఎం చేతుల మీదుగా నారాయణపేట జిల్లాలో కార్డులు అందించింది. అప్రూవ్ అయిన కార్డుల్లో 5,90,488 లబ్ధిదారులతో పాటు పెండింగ్​లో ఉన్న 6,39,784 మంది కొత్త సభ్యులను కార్డుల్లో చేర్చింది. దీంతో మే 23 వరకు 12,30,272 మంది కొత్తగా తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులు అయ్యారు. ఆ తర్వాత మే 24 నుంచి ఇప్పటిదాకా కేవలం 50 రోజుల్లోనే మరో 3,58,187 కార్డులు మంజూరు చేసింది. 

ఇందులో 11,11,223 మందిని కొత్త లబ్ధిదారులుగా గుర్తించింది. అదేవిధంగా, వీరితో పాటు మరో 4,41,851 మంది లబ్ధిదారులను పాత కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చింది. ఫలితంగా 50 రోజుల్లోనే 15,53,074 మంది కొత్తగా రేషన్ లబ్ధిదారులుగా మారారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5.61 లక్షల రేషన్ కార్డులు అందించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో కేవలం 45 వేల కార్డులు మాత్రమే ఇచ్చింది.