అనువంశిక అర్చక సర్వీస్ రూల్స్‌ను అమలు చేయాలి

అనువంశిక  అర్చక సర్వీస్ రూల్స్‌ను అమలు చేయాలి

అనువంశిక అర్చకుల హోదాను తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పునరుద్ధరించడం లేదని ఆలయాల పరిరక్షణ ఉద్యమ కన్వీనర్, చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సి.ఎస్.రంగరాజన్, తెలంగాణ శ్రీ వైష్ణవ సేవా సంఘం అధ్యక్షుడు ఎస్.తిరువెంగళాచార్యులు ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన అనువంశిక  అర్చక సర్వీస్ రూల్స్‌ను తక్షణమే అమలు చేయాలని కోరారు. దీనిపై వారు గురువారం ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారిని కలిసి విజ్ఞప్తి చేశారు. వంశపరంపరాగత అర్చకుల పద్ధతులను, తెలంగాణలో ముతవల్లి వ్యవస్థలను ప్రభుత్వం నిలిపివేస్తే..  సంప్రదాయ దేవాలయాలు, గ్రామీణ దేవాలయాలు మూతపడతాయని 1996లో డాక్టర్ ఎంవీ సౌందరరాజన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని గుర్తు చేశారు.  ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 2007లో..

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 2007లో ఒక చట్టం ద్వారా అనువంశిక అర్చకుల సేవలను పునరుద్ధరించిందని, దురదృష్టవశాత్తు అదే ఇంకా తెలంగాణలో అమలు కాలేదని వారు చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019లో విడుదల చేసిన 439 జీవో ద్వారా ఇప్పటికే అమల్లోకి వచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అర్చకులు, ఆలయ ఉద్యోగులకు పే స్కేల్‌లను విజయవంతంగా అమలు చేస్తోందని, వారసత్వ నిబంధనల జీవోను కూడా అమలు చేయాలన్నారు. వారి విజ్ఞప్తులను ఓపికగా విన్న  ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి , అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.