- సర్కారు బడుల్లో టీచర్ల సర్దుబాటుకు చర్యలు
- గైడ్‌లైన్స్ రిలీజ్ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్
- 23లోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: సర్కారు స్కూళ్లలో టీచర్ల సర్దుబాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండి తక్కువ మంది టీచర్లున్న చోట.. అవసరమైనంత మంది టీచర్లను అడ్జెస్ట్ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను ఈ నెల 23లోగా పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి సర్దుబాటు గైడ్‌లైన్స్ రిలీజ్ చేశారు.
అయితే, గతంలో ఎప్పుడూ డీఈఓలే లోకల్‌గా సర్దుబాటు చేసేవారు. అయితే, పలు ఆరోపణల నేపథ్యంలో తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో గైడ్‌లైన్స్ ఇచ్చి, అడ్జెస్ట్మెంట్ కు ఆదేశాలు జారీచేశారు. ఆర్టీఈ చట్టం ప్రకారం 1: 30 రేషియాలో స్టూడెంట్.. టీచర్నిష్పత్తి ఉండాల్సి ఉండగా, రాష్ట్రంలో మాత్రం 1: 17 రేషియాలో ఉంది.
అయినా, ఇటీవల టీచర్ల బదిలీల ప్రక్రియ జరిగిన నేపథ్యంలో పలు స్కూళ్లలో పిల్లల సంఖ్య ఎక్కువ ఉండి.. టీచర్లు తక్కువగా ఉండటం, పిల్లలు తక్కువ ఉన్నచోట.. టీచర్లు ఎక్కువగా ఉన్నట్టు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో పిల్లల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను గతంలో ఇచ్చిన విద్యాశాఖ ఉత్తర్వులకు అనుగుణంగా అడ్జెస్ట్ చేయాలని నిర్ణయించింది.
పది మంది వరకుంటే ఒక టీచర్
ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో పదిమంది వరకు పిల్లలుంటే.. ఒక టీచర్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 11– 60 మంది ఉంటే ఇద్దరు, 61– 90 పిల్లలుంటే ముగ్గురు, 91– 120 మంది ఉంటే నలుగురు, 121 – 150 మంది ఉంటే ఐదుగురు, 151 – 200 మంది వరకూ పిల్లలుంటే ఆరుగురు టీచర్లను ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాతి ప్రతి 40 మంది పిల్లలకు ఒక టీచర్‌ను అదనంగా పెట్టుకోవాలి. అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో 20 మంది పిల్లలుంటే ఇద్దరు టీచర్లు (ఒకరు లాంగ్వేజీ, మరొకరు నాన్ లాంగ్వేజీ) ఉండాలి, 21కి పైగా పిల్లలుంటే నలుగురు టీచర్లను ఏర్పాటు చేసుకోవాలి.
హైస్కూళ్లలో 220 మంది వరకూ పిల్లలుంటే సబ్జెక్టుకో టీచర్ చొప్పున ఏడుగురిని నియమించుకోవాలి. 221– 250 వరకు పిల్లలుంటే.. మ్యాథ్స్ సబ్జెక్టులో ఇద్దరు టీచర్లను, 280 మంది ఉంటే మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులకు ఇద్దరు టీచర్ల చొప్పున ఏర్పాటు చేసుకోవాలి. ఇలా విద్యార్థుల సంఖ్య పెరిగిన కొద్ది సబ్జెక్టు టీచర్ల సంఖ్యను పెంచుతూ ఉత్తర్వులిచ్చారు. 371– 400 మంది వరకూ ఉంటే ప్రతి సబ్జెక్టులో ఇద్దరు టీచర్లను నియమించుకోవాలని సూచించింది.
సర్దుబాటు ఇలా..
టీచర్ల సర్దుబాటులో పలు జాగ్రత్తలు తీసుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ సూచించింది. విద్యాశాఖ ప్రకటించిన ప్రకారం టీచర్ల సంఖ్యలో మార్పులుంటే ముందుగా గ్రామపంచాయతీ పరిధిలో, అక్కడ చాన్స్ లేకుంటే స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో, అప్పటికీ చాన్స్ లేకుంటే మండలం పరిధిలోని స్కూళ్లలో అడ్జెస్ట్ మెంట్ చేయాలని తెలిపింది. మండలం లోనూ అవకాశం లేకుంటే జిల్లా యూనిట్ గా సర్దుబాటు చే యాలని ఆదేశించింది.
ఈ క్రమంలోనే ఒకే గ్రామపంచాయతీ పరిధిలో రెండు స్కూళ్లుంటే.. అక్కడ ఒక స్కూల్ యూనిట్‌గా టీచర్లను సర్దుబాటు చేయాలి. యూపీఎస్, పీఎస్ స్కూళ్లున్నా.. అదే పాటించాలని తెలిపింది. ఒకే ప్రాంగణంలో రెండు హైస్కూళ్లు ఉన్నా.. అవసరాన్ని బట్టి ఒకే స్కూల్ యూనిట్‌గా పరిగణించి, సర్దుబాటు చేయాలని ఆదేశించింది.