
- అన్ని హాస్పిటల్స్‌లో ప్రత్యేక ఫీవర్ వార్డుల ఏర్పాటుకు ఆదేశాలు
- హాస్పిటల్స్‌లో వసతులు, లోపాలపై తనిఖీలకు స్పెషల్ టీమ్స్
- రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది టీంలు.. ఒక్కో టీంకు నాలుగు జిల్లాలు
- వార్డులు, మందులు, ల్యాబ్‌లు, శానిటేషన్ పరిస్థితిని తనిఖీ చేయనున్న టీమ్స్
మంచిర్యాల, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అన్ని జిల్లా హాస్పిటల్స్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటళ్లలో ప్రత్యేకంగా ఫీవర్ వార్డుల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. ఆయా హాస్పిటళ్లలో అందుబాటులో ఉన్న వసతులు, లోపాలపై స్పెషల్ టీమ్స్‌తో ఆరా తీస్తోంది. తద్వారా పేషెంట్లకు మరింత మెరుగైన ట్రీట్‌మెంట్ అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది టీమ్‌లు
రాష్ట్రవ్యాప్తంగా హాస్పిటళ్లలో వసతుల పరిశీలన కోసం స్టేట్ లెవల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఎనిమిది టీమ్‌లను ఏర్పాటు చేసింది. ఒక్కో టీంకు నాలుగు జిల్లాలను కేటాయించింది. ఈ టీంలు జీజీహెచ్‌లు, జిల్లా, ఏరియా హాస్పిటల్స్, సీహెచ్‌సీలను తనిఖీ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనున్నాయి. ఫీవర్ వార్డుల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయా ? డాక్టర్లు, స్టాఫ్ అందుబాటులో ఉంటున్నారా ? అవసరమైన మందులు ఉన్నాయా ? ల్యాబ్‌లలో అన్ని రకాల టెస్ట్‌లు చేస్తున్నారా ? పేషెంట్లకు హైజీన్ ఫుడ్ అందుతుందా ? శానిటేషన్ నిర్వహణ ఎలా ఉంది ? ఇప్పటివరకు మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి కేసులు ఎన్ని నమోదయ్యాయి ? జ్వరాలతో వస్తున్న పేషెంట్లకు ఎలాంటి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు ? వంటి అంశాలను ఆఫీసర్లు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో గుర్తించిన లోపాలను వెంటనే సరిచేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచిస్తున్నారు.
మంచిర్యాలలో టీవీవీ కమిషనర్ పర్యటన
హాస్పిటళ్ల పరిశీలనలో భాగంగా రాష్ట్ర వైద్య విధాన పరిషత్ (టీవీవీ) కమిషనర్ అజయ్‌కుమార్ నేతృత్వంలోని టీం సోమవారం మంచిర్యాల జిల్లాలో పర్యటించింది. గవర్నమెంట్జనరల్ హాస్పిటల్, లక్సెట్టిపేట, బెల్లంపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, మందమర్రి పీహెచ్‌సీతో పాటు జిల్లా కేంద్రంలోని ఓంసాయి హాస్పిటల్‌ను తనిఖీ చేశారు. జీజీహెచ్‌లో 30 బెడ్స్‌తో ఏర్పాటు చేసిన ఫీవర్ వార్డును పరిశీలించి అక్కడి పరిస్థితి గురించి పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు.
శానిటేషన్ నిర్వహణ మరింత మెరుగుపర్చాలని, మెడికల్ వేస్టేజ్‌ని ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేయాలని సూచించారు. మంగళ, బుధవారాల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తమ దృష్టికి వచ్చిన అంశాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రికి రిపోర్ట్ సమర్పిస్తామని చెప్పారు. ఆయన వెంట డీఎంహెచ్‌వో హరీశ్‌రాజ్, జీజీహెచ్ సూపరింటెండెంట్ హరీశ్ చంద్రారెడ్డి ఉన్నారు.
మూడు నెలలు అలర్ట్‌గా ఉండాల్సిందే
రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండడంతో జ్వరాలతో పాటు సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ముఖ్యంగా దోమల కారణంగా మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులు చుట్టుముట్టే చాన్స్ ఉంది. వ్యాధుల తీవ్రత పెరగకముందే వాటిని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడానికి అన్ని రకాల చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆర్డర్స్ జారీ చేసింది.
వానాకాలం ముగిసేంత వరకు అంటే మరో మూడు నెలల పాటు ఎక్కడికక్కడ అలర్ట్‌గా ఉండాలని, పేషెంట్లకు క్వాలిటీ ట్రీట్‌మెంట్ అందించాలని, తద్వారా మరణాలను నివారించాలని సూచించింది. శానిటేషన్ లోపమే వ్యాధులకు ప్రధాన కారణంగా గుర్తించిన ప్రభుత్వం పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పారిశుధ్య పనులను మరింత పకడ్బందీగా నిర్వహించాలని, దోమల నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది.