వాయిదా పడిన పరీక్షలు పెడ్తరా పెట్టరా?

వాయిదా పడిన పరీక్షలు పెడ్తరా పెట్టరా?
  • ఆందోళనలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్
  • ఫైనలియర్ వారికే మినహాయింపనే లీకులు
  • ఇంటర్ సప్లిమెంటరీ పైనా, ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ పైనా అయోమయం
  • సర్కారు నిర్ణయమే ఫైనల్ అంటున్న అధికారులు

కరోనా ఎఫెక్ట్ ‌తో పోస్ట్ ‌పోన్‌‌ అయిన పలు ఎగ్జామ్స్‌ పై సర్కారు క్లారిటీ ఇవ్వడం లేదు. అసలు ఎగ్జామ్స్ పెడ్తారా.. పెట్టరా.? ఏదీ చెప్పడం లేదు. దీంతో ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ ఇలా… స్టూడెంట్లందరిలో టెన్షన్‌‌ నెలకొంది. అయితే ఫైనలియర్ వారికి మాత్రం మినహాయింపులు ఉండే అవకాశముందని లీకులు ఇస్తున్నా, అధికారికంగా క్లారిటీ ఇవ్వడం లేదు.

మార్చి, ఏప్రిల్ నెలల్లో జరగాల్సిన డిగీ, పీజీ పరీక్షలు కరోనా ఎఫెక్ట్​తో వాయిదా  పడ్డాయి. రాష్ట్రంలో మొత్తం డిగ్రీ ఫైనలియర్ స్టూడెంట్లు1.10లక్షల మంది వరకూ ఉండగా, ఓయూ పరిధిలోనే సుమారు 62వేల మంది ఉంటారు. మిగిలిన వారంతా ఇతర వర్సిటీల్లో చదువుతున్నారు. యూజీసీ గైడ్ లైన్స్​ప్రకారం ముందుగా ఫైనలియర్ స్టూడెంట్లకు జూన్20 నుంచి ఎగ్జామ్స్‌‌ పెట్టుకోవచ్చని ఉన్నత విద్యామండలి అన్ని వర్సిటీలకు సూచించింది. స్టూడెంట్ల నుంచి పరీక్ష ఫీజు కూడా తీసుకున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్‌‌తో పరీక్షల నిర్వహణ కష్టమేనని అన్ని వర్సిటీలు సర్కారుకు చెప్పేశాయి. దీనిపై సర్కారు నిర్ణయమేమీ రాలేదు.

ఇంజనీరింగ్  పైనా అయోమయమే…

రాష్ట్రంలో బీటెక్ ఫైనలియర్‌‌లో 50 వేల మంది స్టూడెంట్లు ఉన్నారు. వారిలో జేఎన్టీయూ పరిధిలోనే 42వేల మంది ఉన్నారు. మిగిలిన 8వేల మంది ఓయూతో పాటు పలు వర్సిటీల పరిధిలో చదువుతున్నారు. ఏఐసీటీఈ, ఉన్నత విద్యామండలి సూచనలతో ఈనెల 20 నుంచి బీటెక్ ఫైనలియర్ పరీక్షలు నిర్వహించాలని జేఎన్టీయూ షెడ్యూల్ రిలీజ్ చేసింది. సర్కారు ఆదేశాలతో పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు వర్సిటీ ప్రకటించింది. దీంతో మళ్లీ పెడ్తారా లేదా తెలియడం లేదు.

ఇంటర్ సప్లిమెంటరీ పైనా అంతే..

ఇంటర్ పరీక్షల ఫలితాలను ఇటీవలే విడుదల చేశారు. దీంట్లో 3.70 లక్షల మంది ఫెయిల్ అయ్యారు. ప్రభుత్వం ఇంకా సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ప్రకటించలేదు. అయితే సప్లిమెంటరీ పరీక్షలు పెట్టొద్దని సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఫెయిల్ అయిన అందరినీ పాస్ చేస్తారా లేక, సెకండియర్​లో ఫెయిల్​అయిన వారిని మాత్రమే పాస్ చేస్తారా అనే దానిపై స్పష్టత లేదు.

ఎంట్రెన్స్‌‌ ఎగ్జామ్స్ ఉంటాయా?

మే నెలలో జరగాల్సిన ఈసెట్, ఎంసెట్, ఎడ్‌‌సెట్, ఐసెట్, పీఈసెట్, లా సెట్… ఇలా అన్ని ఎంట్రెన్స్ పరీక్షలు జులైలో జరుగుతాయని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. జులై 1న పాలిసెట్, పీజీఈసెట్ ఎగ్జామ్స్​ప్రారంభం కానున్నాయి. జులై 6 నుంచి 9 వరకు ఎంసెట్ పరీక్షలుంటాయి. అయితే కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుండడంతో పరీక్షలు నిర్వహిస్తారా లేదా అనే అనుమానం నెలకొంది.

సీఎం వద్ద ఫైల్...

డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ తదితర పరీక్షల నిర్వహణపై ఇటీవల ఉన్నత విద్యామండలిలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్​ సోమేశ్​కుమార్ విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. దీంట్లో ఆయా పరీక్షలను రద్దు చేసి, గ్రేడింగ్ ఇవ్వాలని మెజార్టీ అభిప్రాయం వచ్చింది. ఈ అభిప్రాయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకుపోయారు. పరీక్షలపై సీఎం త్వరగా స్పష్టత ఇవ్వాలని స్టూడెంట్లు, తల్లిదండ్రులు కోరుతున్నారు.