ఎవుసానికి ఏఐ.. రైతుల‌‌‌‌కు సలహాలు, సూచనల కోసం భారత్‌‌‌‌-విస్తార్ ఏఐ టూల్‌‌‌‌

ఎవుసానికి ఏఐ.. రైతుల‌‌‌‌కు సలహాలు, సూచనల కోసం భారత్‌‌‌‌-విస్తార్ ఏఐ టూల్‌‌‌‌

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగాన్ని సాంకేతిక పథంలో నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రైతులకు వారి స్థానిక భాషల్లోనే సాగు సలహాలు అందించేలా ‘భారత్- –విస్తార్’ (వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ టు యాక్సెస్‌‌‌‌ అగ్రికల్చరల్‌‌‌‌ రీసోర్సెస్‌‌‌‌)  మల్టీ లాంగ్వేజ్‌‌‌‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్‌‌‌‌ను ప్రారంభించనున్నట్లు  నిర్మలా సీతారామన్  ప్రకటించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ వ్యవసాయ పోర్టల్‌‌‌‌లను ఈ వేదిక ద్వారా అనుసంధానం చేస్తారు.  ప్రభుత్వ అగ్రిస్టాక్ పోర్టల్‌‌‌‌లను, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్​) సాగు విధానాలను ఏఐతో లింక్‌‌‌‌ చేస్తారు. 

దీనివల్ల రైతులకు తమ ప్రాంతీయ భాషల్లోనే సలహాలు అందుతాయి. సాగు సమయంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి ఈ సాంకేతికత ఎంతగానో తోడ్పడుతుందని నిర్మలా సీతారామన్‌‌‌‌ వెల్లడించారు. కాగా, ఈసారి కేంద్ర బడ్జెట్‌‌‌‌లో వ్యవసాయ, అనుబంధ రంగాల కోసం రూ.1,62,671   కోట్లు కేటాయించారు. ఇది నిరుడు సవరించిన అంచనాల (రూ. 1,51,853 కోట్లు) కంటే 7.12% శాతం అధికం.  అలాగే, వ్యవసాయ పరిశోధన, విద్యకు రూ. 9,941  కోట్ల కేటాయింపులు చేశారు.  ఇందులో మత్స్య రంగానికి అత్యధికంగా రూ. 2,761.80 కోట్లు కేటాయించారు. 

ఇందులో ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన’ (పీఎంఎంఎస్‌‌‌‌వై) కు రూ. 2,500 కోట్లు కేటాయించారు. అలాగే, వ్యవసాయం, ఉద్యానవన రంగాల అభివృద్ధికి విప్లవాత్మక ప్రకటనలు చేశారు. ముఖ్యంగా జీడిపప్పు, కొబ్బరి సాగులో భారత్ స్వయం సమృద్ధి సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. 2030 నాటికి మన దేశీ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో అత్యుత్తమ బ్రాండ్‌‌‌‌లుగా నిలబెట్టేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేశారు.

రైతుల‌‌‌‌కు సలహాలు, సూచనల కోసం ‘భారత్‌‌‌‌-విస్తార్’ ఏఐ టూల్‌‌‌‌

  • వివిధ అగ్రికల్చర్​ పోర్టల్స్‌‌‌‌ అన్నీ అనుసంధానం
  • వ్యవసాయ రంగానికి రూ.1,62,671 కోట్లు
  • నిరుడికంటే 7.12 శాతం అధికం
  • వ్యవసాయ పరిశోధన, విద్యకు రూ. 9,941 కోట్లు కేటాయింపు
  • కొబ్బరి ఉత్పత్తి కోసం ప్రోత్సాహక పథకం
  • 500 రిజర్వాయర్లలో చేపల అభివృద్ధికి చర్యలు
  • తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం
  • జీడిపప్పు, కోకో ఉత్పత్తి కోసం ప్రత్యేక చర్యలు
  • బాదం, పైన్‌‌‌‌నట్స్‌‌‌‌ కోసం స్పెషల్​ స్కీమ్‌‌‌‌

కీలక ప్రతిపాదనలివే

  • పశుపోషణ, డైరీ, పౌల్ట్రీ పరిశ్రమలకు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్‌‌‌‌ అమలు
  • పశువైద్య నిపుణుల సంఖ్యను 20 వేలకు పెంచడానికి, ప్రైవేట్ వెటర్నరీ కాలేజీలు, ఆసుపత్రులకు మద్దతు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.
  • దేశంలో సుమారు 3 కోట్ల మంది జీవనోపాధి పొందుతున్న కొబ్బరి రంగాన్ని బలోపేతం చేసేందుకు ‘కొబ్బరి ప్రోత్సాహక 
  • పథకం’ (కోకోనట్‌‌‌‌ ప్రమోషన్‌‌‌‌ స్కీమ్‌‌‌‌) ప్రకటించారు. పాత చెట్ల స్థానంలో అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలను నాటేందుకు మద్దతు ఇస్తారు.
  • 2030 నాటికి దేశీయ జీడిపప్పు, కోకో ఉత్పత్తులను అంతర్జాతీయ బ్రాండ్‌‌‌‌లుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
  • భారతీయ సంస్కృతితో ముడిపడి ఉన్న గంధపు చెట్ల సాగు, ప్రాసెసింగ్‌‌‌‌ను రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పునరుద్ధరించనున్నారు.
  • హిమాలయ ప్రాంతాల్లో వాల్‌‌‌‌నట్స్, బాదం, పైన్ నట్స్ తోటల విస్తరణకు, యువతను భాగస్వాములను చేస్తూ మద్దతు ఇస్తారు.
  • ఈశాన్య రాష్ట్రాల్లో అగర్ చెట్ల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తారు.
  • తునికాపై పన్ను (టీసీఎస్‌‌‌‌)ను 2 శాతానికి తగ్గించి సేకరించేవారికి ఊరటనిచ్చారు.
  • మత్స్య రంగానికి భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించారు. దేశ సముద్ర జలాల్లో  భారతీయ నౌకల ద్వారా పట్టే చేపలపై ఎలాంటి పన్ను విధించరు. విదేశీ పోర్టుల్లో వీటిని అన్‌‌‌‌లోడ్ చేసినా ఎగుమతులుగానే పరిగణిస్తారు. 
  • దేశవ్యాప్తంగా 500 రిజర్వాయర్లు, అమృత్ సరోవర్లను మత్స్య సంపద పెంచేందుకు అభివృద్ధి చేస్తారు. దీనివల్ల దాదాపు 50 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.
  • మహిళా స్వయం సహాయక బృందాలు, స్టార్టప్‌‌‌‌ల ద్వారా మత్స్య ఉత్పత్తుల విక్రయాలకు మార్కెట్ అనుసంధానం చేస్తారు. 
  • స్టార్టప్‌‌‌‌లు, మహిళా సంఘాలు, రైతుల ద్వారా మత్య్సకారులకు మార్కెట్ లింకేజీ ఏర్పాట్లు చేస్తారు.