
- బీఆర్ఎస్ను కార్నర్ చేసేలా అన్ని ఆధారాలతో ప్రభుత్వం సన్నద్ధం
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఫుల్ రిపోర్టును ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టనున్నట్టు తెలిసింది. మాజీ సీఎం కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను బాధ్యులుగా చేస్తూ కమిషన్ 665 పేజీలతో రిపోర్టు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడిన అవకతవకలపై అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని ప్రభుత్వం సిద్ధమవుతున్నది. అందుకు తగ్గట్టుగా బీఆర్ఎస్ను కార్నర్ చేసేందుకు.. బ్యారేజీల లొకేషన్ల ఎంపిక, నిర్మాణం, నిర్ణయాల నుంచి డ్యామేజీల వరకు అన్ని ఆధారాలతో అసెంబ్లీ ముందుకు రానున్నట్టు తెలుస్తున్నది.
రిపోర్టులోని ముఖ్యమైన అంశాలను బలపరిచేలా అన్ని ఆధారాలతో సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ప్రాజెక్ట్ అధికారుల నుంచి తెప్పించుకుంటున్నది. శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే అధికారులతో రివ్యూ చేస్తున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో నాటి ప్రభుత్వ పెద్దలు ఏకపక్ష నిర్ణయాలు ఎలా తీసుకున్నారో సాక్ష్యాధారాలతో ప్రజలకు వివరించనున్నారు. కాగా, అసెంబ్లీలో ఫిజికల్ కాపీలను సభ్యులకు అందించనున్నట్టు సమాచారం.