రైతులు అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది:కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

రైతులు అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది:కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

అచ్చంపేట, వెలుగు: ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని నాగర్‌‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ భరోసా ఇచ్చారు. ఆదివారం ఉప్పునుంతల మండలంలోని పెద్దాపూర్, లక్ష్మాపూర్ వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఆయన, ధాన్యం నష్టపోకుండా వెంటనే బాయిలర్ మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. 

తేమ శాతం, నిల్వలు, తూకం ప్రక్రియ, రైతులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులతో మాట్లాడిన కలెక్టర్, పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. యూరియా కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని, ఆన్‌‌లైన్ విధానంలో పంపిణీ జరిగేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. అనంతరం కుటుంబ సమేతంగా ఉమామహేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.