సర్కారు స్కూల్ స్టూడెంట్లకు షూస్, బెల్ట్..వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం

సర్కారు స్కూల్ స్టూడెంట్లకు షూస్, బెల్ట్..వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం
  •     కేజీబీవీ, మోడల్ స్కూల్ హాస్టల్ పిల్లలకు 18 రకాల వస్తువులు 
  •     కొత్తగా బ్యాగులు, స్టేషనరీ కిట్, మూడు రకాల డ్రెస్సులు.. 
  •     గురుకులాల విద్యార్థులతో సమానంగా వసతులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అందించే సౌకర్యాలను మరింత పెంచనున్నట్లు తెలిపింది. స్టూడెంట్లందరికీ షూస్ తో పాటు బెల్టూ అందించాలని నిర్ణయించింది. వీటితో పాటు కేజీబీవీ, యూఆర్ఎస్, మోడల్ స్కూల్​ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకూ  గురుకుల విద్యార్థులతో సమానంగా వసతులు కల్పించనున్నది. గవర్నమెంట్, లోకల్ బాడీ స్కూళ్లలో సుమారు  18.70 లక్షల మంది చదువుతున్నారు. 

వీరికి బెల్టులు, బ్లాక్ షూస్, రెండు జతల సాక్స్‌‌‌‌‌‌‌‌లను అందించనున్నారు. అయితే, టైలను బాయ్స్, గర్ల్స్ కు వేర్వేరుగా ఇస్తారు. వీటితో పాటు ఏటా ఇచ్చే యూనిఫామ్​, నోట్ బుక్స్, టెస్ట్స్, వర్క్ బుక్స్  కూడా ఇవ్వనున్నారు. వీటిని జూన్12 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభ రోజే అందించేలా విద్యాశాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. 

గురుకులాలతో సమానంగా..

ఇప్పటివరకు కేజీబీవీ,అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్,  మోడల్ స్కూల్ హాస్టళ్లలో చదివే విద్యార్థులకు సౌకర్యాల విషయంలో కొంత వ్యత్యాసం ఉంది. ఇకపై వీరికి కూడా ఇతర రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులతో సమానంగా అన్ని వస్తువులను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లో భాగంగా కేజీబీవీ, మోడల్ స్కూల్ హాస్టల్ పిల్లలకు ఏకంగా 18 రకాల వస్తువులను పంపిణీ చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు ఇచ్చే కిట్‌‌‌‌‌‌‌‌లో కీలక మార్పులు చేశారు. గతంలో లేనివిధంగా కొత్తగా స్కూల్ బ్యాగులు, ట్రంక్ బాక్స్, స్టేషనరీ కిట్లు ఇవ్వనున్నారు. హాస్టల్ విద్యార్థులకు కొత్తగా స్పోర్ట్స్ యూనిఫాం, పీటీ డ్రెస్, నైట్ డ్రెస్ లనూ అదనంగా  ఇవ్వనున్నారు. 

పీఎంయూ ద్వారానే అన్నీ.. 

విద్యార్థుల యూనిఫామ్స్ కోసం అవసరమైన క్లాత్​ ను టెస్కో ద్వారా అందించేలా గతేడాది అక్టోబర్​లోనే విద్యాశాఖ ఒప్పందం కుదర్చుకున్నది. దీని ప్రకారం ఏప్రిల్ నెలాఖరుకు మండల, స్కూల్ పాయింట్లకు చేరేలా షెడ్యూల్ రెడీ చేసుకున్నారు. గురుకులాలతో పాటు విద్యాశాఖ పరిధిలోని విద్యాసంస్థల కోసమూ ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్​ (పీఎంయూ) ద్వారా వస్తువులను సేకరించాలని ఆదేశించింది. దీంతో టెస్కో ఇప్పటికే యూనిఫామ్ క్లాత్ రెడీ చేస్తే ఎలా అనేదానిపై అయోమయం నెలకొన్నది. అయితే, అది సర్కారు సంస్థ కావడంతోనే ఇబ్బంది ఉండదని అధికారులు భావిస్తున్నారు. 

విద్యార్థులకు అందే వస్తువులివే.. 

స్కూల్ బ్యాగులు, బెల్ట్, టై ఐడీ కార్డు (హోల్డర్‌‌‌‌‌‌‌‌తో సహా), బెడ్ షీట్లు, టవల్స్, కార్పెట్లు, ట్రంక్ బాక్సులు, ప్లేట్, గ్లాస్, కటోరా, కప్పు అండ్ స్పూన్, ట్రాక్ సూట్లు, నైట్ డ్రెస్సులు, పీటీ డ్రెస్సులు, బ్లాక్ షూస్ + 2 జతల సాక్స్, వైట్ షూస్ + 2 జతల సాక్స్, దుప్పట్లు, స్టేషనరీ కిట్, నోట్ బుక్స్ తదితర వాటిని అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.