కేటీఆర్.. ఏ మొఖం పెట్టుకుని కౌశిక్ దగ్గరకు పోయినవ్?: ఆది శ్రీనివాస్

కేటీఆర్..  ఏ మొఖం పెట్టుకుని కౌశిక్ దగ్గరకు పోయినవ్?: ఆది శ్రీనివాస్
  • మహిళలను అవమానించినందుకు కౌశిక్ రెడ్డిని అభినందించినవా? 
  • ఆంధ్రా వాళ్లను కించపరిచినందుకు అలయ్ బలయ్ ఇచ్చినవా? 
  • మీ ఎమ్మెల్యేను మందలించాల్సిందిపోయి.. మెచ్చుకునుడేంది? 
  • కౌశిక్​తో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు: ఏ మొఖం పెట్టుకుని ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డి ఇంటికి వెళ్లావంటూ బీఆర్ఎస్​వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ‘‘మహిళలను కించపరిచినందుకు కౌశిక్​రెడ్డిని అభినందించారా? చీర, గాజులు పంపుతానని ఆడబిడ్డలను అవమానించినందుకు ఆలింగనం చేసుకున్నారా?’’ అని ప్రశ్నించారు. శనివారం సీఎల్పీలో మీడియాతో ఆది శ్రీనివాస్ మాట్లాడారు. ‘‘కౌశిక్​రెడ్డి మదమెక్కిన ఆంబోతులా రంకెలేస్తూ కనిపించిన వారందరి మీద ఎగబడుతున్నందుకు భుజం తట్టావా? చిన్నాపెద్దా అనే తేడా లేకుండా కల్లు తాగిన కోతిలా చిందులేస్తున్నందుకు సత్కారం చేసి వచ్చావా? ఆంధ్రా సెటిలర్లను అవమానించినందుకు అలయ్ బలయ్ ఇచ్చి వచ్చావా? పోలీసు అధికారులను బెదిరిస్తున్నందుకు వెన్నుతట్టి అభినందించి వచ్చావా?” అని కేటీఆర్ ను ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డిని మందలించాల్సింది పోయి పరామర్శిస్తావా? అని మండిపడ్డారు. సెటిలర్లను అవమానించినందుకు ఆయనతో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్​ చేశారు. 

అమెరికాలో జల్సా చేసి.. ఇప్పుడు హడావుడి: మేడిపల్లి సత్యం

అమెరికాలో పది రోజులు జల్సా చేసి వచ్చిన కేటీఆర్..​ ఇప్పుడు తెగ హడావుడి చేస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విమర్శించారు. ‘‘వర్షాలు, వరదల వల్ల ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్​ప్రజలు అల్లాడిపోతే.. కేటీఆర్ కనీసం మాట్లాడిన దాఖలాలు లేవు. రాష్ట్రానికి రూ.10 వేల కోట్ల నష్టం జరిగితే కేసీఆర్, కేటీఆర్ స్పందించలేదు. అమెరికా నుంచి వచ్చిన వెంటనే ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్​రైతులను కలుస్తారనుకున్నాం. కానీ కౌశిక్​రెడ్డి అనే శాడిస్ట్, సైకో, పిచ్చి కుక్కలా స్వైరవిహారం చేస్తున్న వ్యక్తి ఇంటికి కేటీఆర్ పోయారు. ఆయనకు రాష్ట్ర ప్రజలపై ప్రేమ లేదు.. కనీసం సానుభూతి కూడా లేదు” అని మండిపడ్డారు. సీఎం కుర్చీపైనే కేసీఆర్, కేటీఆర్ ఆలోచన ఉన్నదని.. రాష్ట్రంలో అశాంతి సృష్టించాలన్నదే వాళ్ల ప్రధాన ఉద్దేశమని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతల అరాచకాలను సాగనివ్వబోమన్నారు. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని, పిచ్చిపిచ్చిగా మాట్లాడితే కాంగ్రెస్​కార్యకర్తలు బట్టలూడదీసి కొడతారని హెచ్చరించారు. 

బీఆర్ఎస్ నేతలు ఊసరవెల్లులు: భూపతి రెడ్డి

బీఆర్ఎస్ నేతల తీరు ఊసరవెల్లుల్లా ఉందని నిజామాబాద్​రూరల్​ఎమ్మెల్యే ఆర్.భూపతి రెడ్డి అన్నారు. ‘‘బీఆర్ఎస్ నేతలు రాయలసీమ పోయి చేపల పులుసు తిని వచ్చి.. ఇప్పుడు ఆంధ్రోళ్లు బతకడానికి వచ్చారని అంటున్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా కేటీఆర్ తీరు ఉంది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను కేటీఆర్ ఎందుకు ఖండించలేదు” అని ప్రశ్నించారు. ‘‘ప్రజాస్వామ్యయుతంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగుతున్నది. ఉనికి కోల్పోతామన్న భయంతోనే బీఆర్ఎస్​నేతలు విమర్శలు చేస్తున్నారు. ఫామ్​హౌస్​లో కూర్చొని ప్రభుత్వాన్ని ఎలా కూల్చాలి? అని కుట్రలు చేస్తున్నారు” అని మండిపడ్డారు. సీఎం రేవంత్​ రెడ్డిపై పిచ్చిపిచ్చిగా మాట్లాడితే కేటీఆర్​ను పిచ్చాస్పత్రిలో చేర్పించాల్సి వస్తుందని అన్నారు.


మీరే అసమర్థులు? 

అసమర్థుడి జీవయాత్రలా సీఎం రేవంత్ పాలన ఉందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు అధికారమిస్తే పదేండ్ల పాటు తెలంగాణను కుక్కలు చింపిన విస్తరి చేసినోళ్లు సమర్థులా? అని ప్రశ్నించారు. ‘‘వేల కోట్ల కమీషన్లు నొక్కేసి ప్రాజెక్టులను గాలికొదిలేశారు. రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి, రాష్ట్రాన్ని దివాలా తీయించారు. వ్యవసాయాన్ని గాలికొదిలేసి వేల మంది రైతుల ఆత్మహత్యకు కారణమయ్యారు. హైదరాబాద్​లో సెల్ఫీ పాయింట్లు తప్ప మరొకటి చేయలేదు. అలాంటి మీరా సమర్థులు?” అని ఫైర్ అయ్యారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్​కు లేదని అన్నారు. ‘‘2019లో పీఏసీ చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి కాకుండా మజ్లిస్ పార్టీకి ఎందుకు ఇచ్చారు? ఆనాడు ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని మీ అయ్య ఫామ్ హౌస్​లో పాతిపెట్టారా?” అని నిలదీశారు. 

కౌశిక్​రెడ్డిని సస్పెండ్​ చేయాలి

పీసీసీ మీడియా కమిటీ చైర్మన్​ సామా రామ్మోహన్​రెడ్డి  

బీఆర్ఎస్​చీఫ్​కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే హరీశ్ రావు, కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పీసీసీ మీడియా కమిటీ చైర్మన్​ సామా రామ్మోహన్​రెడ్డి డిమాండ్​చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఉన్న వ్యక్తిగత విషయాలను కాంగ్రెస్ పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వారి వ్యక్తిగత గొడవలను ప్రాంతీయ గొడవలుగా మార్చే కుట్ర చేస్తున్నారని ఫైర్​ అయ్యారు. శనివారం గాంధీ భవన్​ లో మీడియాతో మాట్లాడారు. హరీశ్ రావుకు పీఏసీ చైర్మన్ పదవి దక్కలేదనే అక్కసుతో పాడి కౌశిక్ ని రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు. కౌశిక్ రెడ్డికి, అరికెపూడి గాంధీకి మధ్య హరీశ్ చిచ్చు పెట్టాడనన్నారు. అమెరికాలో జల్సాలు చేసిన కేటీఆర్.. హైదరాబాద్ రాగానే వరద బాధితులను ఎందుకు పరామర్శించలేదని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్​నేరుగా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి రెచ్చగొట్టే మాటలు మాట్లాడారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటే విధంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తోందని ఆయన పేర్కొన్నారు.