ఆఫీసర్లపై ప్రభుత్వ విప్​, ఎమ్మెల్యే గొంగిడి సునీత సీరియస్

ఆఫీసర్లపై ప్రభుత్వ విప్​, ఎమ్మెల్యే గొంగిడి సునీత సీరియస్

యాదాద్రి, వెలుగు :  వివిధ డిపార్ట్​మెంట్ల ఆఫీసర్లపై ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత సీరియస్​ అయ్యారు. తనకు చెప్పకుండానే పనులు చేసుకుంటూ పోతే ఎలా? అని మండిపడ్డారు. హాస్టళ్ల లోపాలు చెప్పినప్పటికీ సవరించరా? అని సీరియస్​అయ్యారు. యాదాద్రి కలెక్టరేట్​లో ఆలేరు నియోజకవర్గ అభివృద్ధిపై డిపార్ట్​మెంట్ల వారీగా శుక్రవారం రివ్యూ జరిగింది. నియోజకవర్గంలో అమలు చేస్తున్న స్కీమ్స్​ కారణంగా ఎంతమందికి లబ్ధి జరుగుతోంది, డెవలప్​మెంట్​ వర్క్స్ ఏ స్టేజిలో ఉన్నాయో ఆఫీసర్లను ఆమె అడిగి తెలుసుకున్నారు. లేబర్, ఎస్సీ, బీసీ డెవలప్​మెంట్, హ్యాండ్లూమ్​ సహా పలు డిపార్ట్​మెంట్ల పనితీరుపై విప్​ అసహనం వ్యక్తం చేశారు.

‘ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. మేము మంజూరు చేయించిన పనులను మాకే చెప్పకుండా చేస్తే ఎలా..?  మేమేం చెప్పుకోవాలి’ అని ప్రశ్నించారు. సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ, హాస్టళ్లలో స్టూడెంట్స్​ తగ్గుతుండడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో గురుకులాల కారణంగా హాస్టళ్లలో స్టూడెంట్స్​సంఖ్య తగ్గుతోందని ఆఫీసర్లు వివరించారు. పూర్తి స్థాయిలో ఫండ్స్​ రాకపోవడంతో లబ్ధిదారులకు లోన్లు అందించలేక పోతున్నామని తెలిపారు. వచ్చే నెలలో ఎడ్యూకేషన్​ ఇయర్​ ప్రారంభమవుతున్నందున స్టూడెంట్స్​కు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంట నష్టపోయిన రైతుల వివరాలను అడిగి తెలుసుకొని వారికి త్వరలోనే పరిహారం అందుతుందని తెలిపారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్​ దీపక్​ తివారి, భువనగిరి ఆర్డీవో భూపాల్​రెడ్డి, సీపీవో భూక్యా మాన్యా నాయక్​, ఎస్సీ కార్పొరేషన్​ ఈడీ శ్యాంసుందర్, డీఏవో అనురాధ, ఎస్సీ, బీసీ డెవలప్​మెంట్​ ఆఫీసర్లు జైపాల్​ రెడ్డి, యాదయ్య సహా పలు డిపార్ట్​మెంట్ల ఆఫీసర్లు పాల్గొన్నారు.