సైన్స్ రంగంలో మహిళల పాత్ర పెరగాలి: గవర్నర్

సైన్స్ రంగంలో మహిళల పాత్ర పెరగాలి: గవర్నర్
  • పాఠశాల స్థాయి నుంచే అమ్మాయిల్లో సైన్స్​పై ఆసక్తి పెంచాలని సూచన

సికింద్రాబాద్​, వెలుగు: సైన్స్  రంగంలో మహిళలు ఎక్కువ సంఖ్యలో రావాలని, తద్వారా మరిన్ని పరిశోధనలు చేసేందుకు అవకాశం ఉంటుందని గవర్నర్​ డాక్టర్​తమిళిసై అన్నారు. నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా పోటీపడుతున్నా.. సైన్స్​ రంగంలో వారి పాత్ర పెరగాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం తార్నాకలో ‘ది ఇండియన్​ఇన్​స్టిట్యూట్​ఆఫ్​ కెమికల్​ టెక్నాలజీ’ లో జరిగిన మహిళా శాస్త్రవేత్తల సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాలికలు సైన్స్​లో పరిశోధనలు చేసేలా ప్రోత్సహించాలని, అందుకు  సైన్స్​పై  వారికి స్కూల్​ స్థాయి నుంచే ఆసక్తి పెంచాలని సూచించారు. మహిళలకు అవకాశాలు కల్పిస్తే మరిన్ని విజయాలు సాధిస్తారన్నారు. ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడంతోనే మహిళలు పరిశోధనల వైపు రావడం లేదని, అన్ని రంగాల్లోనూ మహిళలు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఆయా రంగాల్లో విజేతలుగా నిలిచిన మహిళలను ఒక వేదికపైకి తెచ్చిన కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. పరిశోధనలతో దేశానికి సేవ లందించిన డీఆర్డీవో ఏరోనాటికల్ సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్ టెస్సీ థామస్, సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ కళైసెల్వి, డీఆర్డీవో మైక్రో ఎలక్ట్రానిక్ డివైజెస్, కంప్యూటేషనల్ అండ్ సైబర్ సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్ సుమా వర్గీస్, డీఎన్ఏ ఫింగర్​ ప్రింటింగ్​ సైంటిస్ట్ ​సంగీత ముఖోపాధ్యాయ, సూపర్​ కండక్టివిటీ సైంటిస్ట్  డాక్టర్​ తనూశ్రీ సిన్హా గుప్తాలను గవర్నర్​ సన్మానించారు. కార్యక్రమంలో ఐఐసీటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ కుమార్ నందికూరి, ఎన్జీఆర్ఐ డైరెక్టర్ తివారీ, సీసీఎంబీ మాజీ డైరెక్టర్ మోహన్ రావు, ఏఎస్టీసీ కన్వీనర్ సీఎల్ నరసింహారావు పాల్గొన్నారు.

బ్రెస్ట్ క్యాన్సర్ పై అవేర్ నెస్ కల్పించాలె

దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరుగుతుండడటం ఆందోళన కలిగిస్తోందని గవర్నర్ తమిళిసై అన్నారు. బ్రెస్ట్​ క్యాన్సర్​ను జయించడం సులభం కాదని, దాని కంటే ముందు బాధ, డిప్రెషన్, నొప్పిని జయించాల్సి ఉంటుందన్నారు. యుక్త వయసు నుంచే దీనిపై అవేర్ నెస్ పెంచాలని, అప్పుడే ఎన్నో ప్రాణాలను కాపాడొచ్చన్నారు. సోమవారం ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజ్ భవన్ లో ఇంటర్నేషన్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ మంత్ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడారు. బ్రెస్ట్ క్యాన్సర్ పై అవేర్ నెస్ కల్పిస్తున్న ఫౌండేషన్ చైర్మన్ రఘరామ్​ను అభినందించారు.