ఓటు హక్కు వినియోగంతోనే ప్రజాస్వామ్యం బలోపేతం : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

ఓటు హక్కు వినియోగంతోనే ప్రజాస్వామ్యం బలోపేతం :  గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
  • జాతీయ ఓటర్ల దినోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 

హైదరాబాద్, వెలుగు: ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థలు బలంగా నిలబడతాయన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాలకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘నా భారత్ – నా ఓటు’ అనే థీమ్‌తో సాగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని అంబేడ్కర్, గాంధీ చెప్పారు. 

రాజ్యాంగం ఎన్నికల సంఘానికి కల్పించిన స్వయంప్రతిపత్తి వల్లే దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు సాధ్యమవుతున్నాయి” అని అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 3.39 కోట్లకు చేరిందని తెలిపారు. ఓటరు జాబితా సవరణ అంటే ఓటర్ల తొలగింపు కాదని, బోగస్ ఓటర్లను ఏరివేయడమేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన అధికారులకు గవర్నర్ అవార్డులు అందజేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.