నిజామాబాద్ జిల్లాలో అగ్రభాగంలో తెలంగాణ వర్సిటీ : రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

నిజామాబాద్ జిల్లాలో అగ్రభాగంలో తెలంగాణ వర్సిటీ  : రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​ జిల్లాలో 2006లో ఏర్పడిన తెలంగాణ విశ్వవిద్యాలయం 19 ఏండ్లలో అద్భుత విజయాలు సాధించి స్టేట్​లో అగ్రస్థానంలో ఉందని గవర్నర్ జిష్ణుదేవ్​వర్మ అన్నారు. విద్యార్థులు, ప్రొఫెసర్లు, అధికారులు, పరిశోధనల వల్లే ఈ రికార్డు సాధ్యమైందన్నారు. బుధవారం టీయూ 2వ కాన్వొకేషన్​లో ఆయన మాట్లాడారు. ఆరు కోర్సులతో మొదలైన వర్సిటీ ఇప్పుడు 31 కోర్సులతో కొనసాగుతుండడం గొప్ప విషయమని కితాబునిచ్చారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు, సామర్థ్యాలను గుర్తించి స్ఫూర్తిదాయకంగా వర్సిటీ నిర్వహిస్తున్నారన్నారు. మున్ముందు మరింత క్వాలిటీ పెంచుకొని స్టూడెంట్స్​లో నైపుణ్యాన్ని పెంచాలని, జాబ్స్ సాధించేలా  తీర్చిదిద్దాలన్నారు. 

క్షయ నిర్మూలనలో గోల్డ్ మెడల్​

సామాజిక సేవా కార్యక్రమాలతో రాష్ట్ర, జాతీయ అవార్డులు పొందిన రెడ్​ క్రాస్​ ద్వారా జిల్లాలోని తలసేమియా బాధితులకు బ్లడ్ సమకూరుస్తున్నామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. రెడ్ క్రాస్ కోఆర్డినేషన్​తో వృద్ధాశ్రమాలు నడుపుతున్నామన్నారు. టీబీ నిర్మూలనకు యంత్రాంగం కృషికి 2022–-23లో గోల్డ్​ మెడల్ అందుకున్నామన్నారు. కలెక్టరేట్​లో నిర్వహించిన మీటింగ్​లో  జిల్లా విషయాలు గవర్నర్ జిష్ణుదేవ్​ వర్మకు కలెక్టర్​వివరించారు. క్షయ నిర్మూలనలో భాగంగా హైరిస్క్ గ్రూప్​లో ఉన్న వారి కోసం రెగ్యులర్ స్ర్కీనింగ్, ఎక్స్​రే చేయిస్తున్నామని, తెమడ పరీక్షల తరువాత ట్రీట్ మెంట్​ ప్రారంభిస్తున్నామన్నారు. వలంటరీ ఆర్గనైజేషన్​లను ఇన్వాల్వ్ చేసి న్యూట్రిషన్ కిట్లు అందజేస్తున్నామన్నారు. 

  గవర్నర్​ జిష్ణుదేవ్ వర్మను కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు సుదర్శన్​రెడ్డి, డాక్టర్​ భూపతిరెడ్డి, ధన్​పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్​రెడ్డి తదితరులు పూలబొకేలు అందించి స్వాగతించారు. రాష్ట్ర సర్కార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న డెవలప్​మెంట్, సంక్షేమ స్కీమ్స్​కు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్​ను గవర్నర్ తిలకించారు. చిన్న వయస్సులో ఎవరెస్ట్​ శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణ, ఫుట్ బాల్ క్రీడాకారిణి గుగులోత్​ సౌమ్య, చరిత్రకారులు, చరిత్ర పరిశోధకులు, కవులు, రచయితలు, సాహితీవేత్తలు, చిత్రకారులు, మ్యుజిషియన్ తదితర రంగాలకు చెందిన 40 మంది జిల్లా ప్రముఖులతో మాట్లాడిన గవర్నర్​.. వారితో ఫొటోలు దిగారు.  గవర్నర్​ రాక సందర్భంగా సీపీ సాయిచైతన్య ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు 
ఏర్పాటు చేశారు. 

నాలుగు జిల్లాలకు వర్సిటీ విస్తరణ

తెలంగాణ వర్సిటీ పరిధిని నిజామాబాద్, కామారెడ్డితో పాటు అదిలాబాద్, నిర్మల్​ జిల్లాలకు విస్తరిస్తానని వైస్ చాన్స్​లర్​ టి.యాదగిరిరావు అన్నారు. అందుకు అవసరమైన మౌలిక వసతులు, టీచింగ్, నాన్​టీచింగ్ స్టాఫ్ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీతో పాటు ఫార్మసీ కళాశాల ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కొత్త అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, అన్ని వసతులతో 500 మంది ఉమెన్స్​కు హాస్టల్, అన్ని హంగులతో వెయ్యి మందికి సరిపడా క్రీడా మైదానం తదితర పనులు చేయబోతున్నామని వివరించారు.