
- కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ అర్బన్, వెలుగు: ఈ నెల 15న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నాలుగవ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం నల్గొండలోని ఎంజీయూను ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి సందర్శించారు. గవర్నర్ పాల్గొననున్న స్నాతకోత్సవ వేదికను పరిశీలించారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర గవర్నర్ రాక సందర్భంగా ఆయా శాఖల అధికారులు వారి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలన్నారు.
ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. గవర్నర్ రాక సందర్భంగా ముందు నుంచే ఎంజీ యూనివర్సిటీలో పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. గుర్తింపు కార్డులు ఉన్నవారిని మాత్రమే 15 న లోపలికి అనుమతిస్తామన్నారు. ఎంజీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ,జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.