- ఏర్పాట్లు పూర్తి మట్టపల్లి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకోనున్న గవర్నర్ దంపతులు
- హుజూర్‌నగర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మఠంపల్లి, వెలుగు:సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పర్యటనకు శుక్రవారం గవర్నర్ రానున్నారు. దీనికి సంబంధించి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు హెలికాప్టర్ ద్వారా రాష్ట్ర గవర్నర్ దంపతులు జిష్ణుదేవ్ వర్మ, సుధాదేవ్ వర్మ మట్టపల్లి చేరుకుని శ్రీలక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకుని స్వామి వారి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభావేదిక వద్దకు చేరుకుని అభివృద్ధి పనులకు గవర్నర్ శంకుస్థాపనలు చేస్తారు. గవర్నర్ దంపతులతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి దంపతులు, రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.
అభివృద్ధి పనులకు శ్రీకారం..
హుజూర్‌నగర్‌లో రూ. 123 కోట్లతో ఏర్పాటు చేయనున్న గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజీకి రూ. 50 కోట్లతో కోదాడలో నిర్మించే జవహర్ నవోదయ విద్యాలయం, మట్టపల్లిలో సత్రం భవనం, వంటశాల , వాటర్ ట్యాంకర్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు, శిలాఫలకాల ఆవిష్కరణ చేస్తారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు మంత్రి ఉత్తమ్ వివరించనున్నారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నర్సింహ అధికార యంత్రాంగంతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. గవర్నర్ పర్యటించే ప్రాంతాలు, రహదారుల వెంట భద్రతను పెంచారు.
