మానవ జ్ఞానానికి ఏఐ ప్రత్యామ్నాయం కాదు.. బిట్సా గ్లోబల్ మీట్లో గవర్నర్‌‌ జిష్ణుదేవ్ వర్మ

మానవ జ్ఞానానికి ఏఐ ప్రత్యామ్నాయం కాదు.. బిట్సా గ్లోబల్ మీట్లో గవర్నర్‌‌ జిష్ణుదేవ్ వర్మ

హైదరాబాద్/శామీర్​పేట, వెలుగు: మానవ విజ్ఞానం, విచక్షణ, నైతికత, సృజనాత్మకత, కరుణకు ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రత్యామ్నాయం కాదని  గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. భారత సాంకేతిక వృద్ధిలో బిట్స్ పిలానీ విద్యార్థుల పాత్ర కీలకమన్నారు. శుక్రవారం శామీర్​పేటలోని బిట్స్ పిలానీ క్యాంపస్‌‌లో ‘బిట్సా గ్లోబల్ మీట్ –ఆరో ఎడిషన్’పే గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిట్స్ పిలానీ సంస్థ కేవలం విద్యా బోధనకే పరిమితం కాకుండా తరతరాలుగా నూతన ఆవిష్కరణలు, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తోందన్నారు.

ప్రస్తుతం ఏఐ, డేటా సైన్స్, ఆటోమేషన్ వంటివి విద్యా వ్యవస్థను మౌలికంగా మారుస్తున్నాయని తెలిపారు. అయితే విద్య అనేది కేవలం ఉద్యోగాల సంపాదన కోసమే కాకుండా.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎదగగల సామర్థ్యాన్ని, జీవితాంతం నేర్చుకునే దృక్పథాన్ని యువతలో నింపాలని సూచించారు. 

సమాజ హితానికి సాంకేతికతను వినియోగించేలా మానవ విలువలను బలోపేతం చేయడమే అసలైన విద్య అని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పేర్కొన్నారు. "వర్సిటీలకు పూర్వవిద్యార్థుల సంఘాలే ప్రాణవాయువు. అవే జ్ఞాన జ్యోతిని ముందు తరాలకు అందిస్తాయి.

యువతకు పూర్వవిద్యార్థులే మార్గదర్శకులుగా నిలిచి జాతీయ స్వయం సమృద్ధిలో భాగస్వాములు కావాలి" అని గవర్నర్ సూచించారు. కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి, బీజీఎం–2026 చైర్‌‌పర్సన్ అనిత సాకూరు, బిట్స్ గ్రూప్ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రామగోపాల్ రావు, ఇన్వెస్టర్ కన్వల్ రేఖి, సీఈవో మయూర్ పట్నాలా తదితరులు పాల్గొన్నారు.