ఇంటర్​ల సున్నాలెట్లొచ్చినయ్​? గవర్నర్​ ఆదేశాలతో విద్యాశాఖ కదలిక 

ఇంటర్​ల సున్నాలెట్లొచ్చినయ్​?  గవర్నర్​ ఆదేశాలతో విద్యాశాఖ కదలిక 

    జిల్లాల్లో స్టూడెంట్లు, టీచర్ల నుంచి వివరాలు సేకరిస్తున్న అధికారులు

    ఇంటర్​ పరీక్షల్లో 35 వేల పేపర్లలో సున్నా మార్కులు

    సప్లిమెంటరీ పరీక్షల్లోనూ 21 వేల పేపర్లలో సున్నా

హైదరాబాద్, వెలుగు:

పదో తరగతి దాకా చదువులో బాగా రాణిస్తున్నారు. మంచి మార్కులతో ఫస్ట్​ క్లాసులో పాసవుతున్నారు. అదేంటో ఇంటర్​కు వచ్చే సరికి మాత్రం డీలా పడిపోతున్నారు. ఇటీవలి ఇంటర్​ పరీక్షల మార్కులే అందుకు ఉదాహరణ. పాసవడం మాట దేవుడెరుగు.. సున్నా మార్కులు వస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ సంఖ్య పదులు, వందలు కాదు, వేలాది మంది విద్యార్థులది అదే పరిస్థితి. కొందరికైతే అన్ని సబ్జెక్టుల్లోనూ సున్నా మార్కులొస్తున్నాయి. దీంతో ఇంటర్​బోర్డు అధికారల్లోనూ ఆందోళన మొదలైంది. గవర్నర్​ నరసింహన్​ కూడా ఈ మధ్య ఈ సున్నా మార్కుల వ్యవహారంపై విస్మయం వ్యక్తం చేయడంతో ఇంటర్​ విద్యా ప్రమాణాలు, సంస్కరణలపైన అందరి దృష్టి పడింది. అసలు దానికి కారణాలేంటో తెలుసుకునే పనిలో అధికారులు పడ్డారు. ఊళ్లు, జిల్లాలు తిరుగుతూ వారి మునుపటి చదువు తీరుతెన్నులపై ఆరా తీస్తున్నారు.

35 వేల పేపర్లలో సున్నా

ఏప్రిల్​18న ఇంటర్​ ఫలితాలను విడుదల చేశారు. 9.74 లక్షల మంది పరీక్షలు రాస్తే, 3.28 లక్షల మంది ఫెయిలయ్యారు. అందులోనూ 9 వేల మంది విద్యార్థులకు వివిధ సబ్జెక్టులకుగానూ 35 వేల పేపర్లలో సున్నా మార్కులొచ్చాయి. పదులు, వందలైతే ఫర్వాలేదు, కానీ, ఒకేసారి వేలు అనేసరికి అందరూ షాక్​ తిన్నారు. ముఖ్యమైన సబ్జెక్టులైన మ్యాథ్స్​లో 7,800 మందికి, ఫిజిక్స్​లో 5,623 మందికి, కెమిస్ర్టీలో 4,233, సివిక్స్​లో 1,978, ఎకనామిక్స్​లో 1,965, కామర్స్​లో 1,245 మందికి సున్నా మార్కులొచ్చాయి. మిగిలిన సబ్జెక్టుల్లోనూ అదే పరిస్థితి. సప్లిమెంటరీ పరీక్షల్లోనూ చాలా పేపర్లలో సున్నాలు చుట్టేశారు. సెకండియర్​లో వివిధ సబ్జెక్టుల్లోని 10 వేల పేపర్లు, ఫస్టియర్​లో 11 వేల పేపర్లలో విద్యార్థులకు సున్నా మార్కులు పడ్డాయి. ఈ సున్నాల వ్యవహారంపై ఇటీవల విద్యాశాఖ అధికారులతో గవర్నర్​ నిర్వహించన సమీక్షలో చర్చ జరిగింది. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన గవర్నర్​, కారణాలతో సహా వివరిస్తూ నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం.

మ్యాథ్స్​, సైన్స్​ గ్రూపుల్లోనే ఎక్కువ

సున్నా మార్కులు ఎక్కువగా మ్యాథ్స్​, సైన్స్​ గ్రూపుల్లోనే వస్తున్నాయి. దానికి కారణం విద్యార్థులు కాలేజీకి సరిగ్గా రాకపోవడం, వారిని యాజమాన్యాలు పట్టించుకోకపోవడమేనని అధికారులు అంటున్నారు. అయితే, అదొక్కటే కారణం కాదని కొందరు అంటున్నారు. కాలేజీకి సరిగ్గా రాని స్టూడెంట్లు కూడా ఫస్ట్​ క్లాసులో పాసవుతున్న సంఘటనలను గుర్తు చేస్తున్నారు. కానీ, ఇంటర్​లో మాత్రం పరిస్థితులు వేరుగా ఉన్నాయంటున్నారు. ఈ ఏడాది ముగ్గురు స్టూడెంట్లకు ఐఐటీల్లో సీటొచ్చినా, ఇంటర్​లో పరీక్ష తప్పారు. ఎంసెట్​లో మంచి ర్యాంకు తెచ్చుకున్నోళ్లూ ఫెయిల్​ అయ్యారు. కారణం, విద్యా ప్రమాణాలు పెంచడంలో ప్రభుత్వం, అధికారులు ఫెయిలయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు సూచిస్తున్నారు.

అధికారులతో కమిటీ

సున్నా మార్కులపై నివేదిక ఇవ్వాల్సిందిగా గవర్నర్ ఆదేశించడంతో ఎస్​సీఈఆర్​టీ, ఇంటర్​బోర్డు అధికారులతో ఓ కమిటీని వేశారు. కమిటీ ఆదేశాల మేరకు పలు జిల్లాల్లో అధికారులు సర్వేలు చేస్తున్నారు. ఇంటర్​లో సున్నా మార్కులు వచ్చిన వారి పదో తరగతి మార్కులను పరిశీలిస్తున్నారు. దీంతో పాటు 8, 9 తరగతుల్లో వాళ్ల చదువు తీరును చూస్తున్నారు. అందుబాటులో ఉండే విద్యార్థులతోనూ మాట్లాడుతున్నారు. టీచర్ల నుంచి వాళ్ల వివరాలను సేకరిస్తున్నారు. జిల్లాల నుంచి సేకరించిన వివరాలతో నివేదికను తయారుచేసి, ప్రభుత్వానికి, గవర్నర్​కు అందించనున్నారు.

సంస్కరణలు అవసరం

ఇంటర్​లో సున్నా మార్కలు రావడం, దిగజారుతున్న ప్రమాణాలకు నిదర్శనం. పరీక్షల విధానంతో పాటు కరికులమ్​, బోధన విధానాలపైనా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇంటర్​తో పాటు బడి చదువుల్లోనూ ప్రమాణాలు పెంచేందుకు విద్యావిధానంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. చదువులో నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పదో తరగతిలోపు రెండు చోట్ల డిటెన్షన్​ విధానం పెడితే బాగుంటుంది.

– మధుసూదన్​ రెడ్డి, ఇంటర్​ విద్య జేఏసీ చైర్మన్