కేరళలో వర్సిటీల చాన్స్​లర్​గా గవర్నర్ తొలగింపు

కేరళలో వర్సిటీల చాన్స్​లర్​గా గవర్నర్ తొలగింపు

తిరువనంతపురం: కేరళలో యూనివర్సిటీలకు చాన్స్ లర్ గా గవర్నర్ ను తొలగిస్తూ ప్రవేశపెట్టిన యూనివర్సిటీ లాస్ (అమెండ్మెంట్)బిల్లును రాష్ట్ర అసెంబ్లీ మంగళవారం ఆమోదించింది. ఇకపై వర్సిటీలకు చాన్స్ లర్ గా ప్రముఖ విద్యావేత్తలను నియమించాలని బిల్లులో ప్రతిపాదించారు. ఇంతకుముందు ఈ బిల్లును సబ్జెక్ట్ కమిటీ పరిశీలించింది. మంగళవారం కొన్ని గంటల పాటు చర్చ తర్వాత బిల్లును పాస్ చేసినట్లు స్పీకర్ ఏఎన్ షంషీర్ ప్రకటించారు. అయితే, గవర్నర్ ను చాన్స్​లర్​గా తొలగించడానికి తాము వ్యతిరేకం కాదని, కానీ తమ సూచనలను పరిగణనలోకి తీసుకోలేదంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ సభను బాయ్ కాట్ చేసింది.

యూనివర్సిటీల చాన్స్ లర్ గా సుప్రీంకోర్టు లేదా కేరళ హైకోర్టు మాజీ జడ్జిలను నియమించాలని తాము కోరుకుంటున్నట్లు ప్రతిపక్షం తెలిపింది. అన్ని వర్సిటీలకు ఒకే చాన్స్​లర్ ఉంటే చాలని.. అలాగే సెలక్షన్ కమిటీలో సీఎం, ప్రతిపక్ష నేత, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉండాలని ప్రతిపాదించింది. అన్ని వర్సిటీలకు ఒకే చాన్స్​లర్ ఉండాలా? వేర్వేరు చాన్స్​లర్లు ఉండాలా? అన్నది ఇంకా నిర్ణయించలేదని న్యాయ మంత్రి పి. రాజీవె తెలిపారు.