లోక్ భవన్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

లోక్ భవన్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
  •     గవర్నర్‌‌ దంపతుల ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌‌, వెలుగు: బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని గవర్నర్‌‌ శివప్రతాప్‌‌ శుక్లా అన్నారు. పూలనే దైవంగా భావించి పూజించే ప్రకృతి పండుగగా అభివర్ణించారు. గురువారం లోక్‌‌భవన్‌‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో గవర్నర్‌‌ తన సతీమణి జానకి శుక్లాతో కలిసి పాల్గొని గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు సుఖసంతోషాలు, శాంతి, ఆరోగ్యం కలగాలని ప్రార్థించారు. బతుకమ్మ ప్రకృతి సౌందర్యానికి, మహిళల సృజనాత్మకతకు, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్‌‌ పేర్కొన్నారు. 

ప్రకృతిని కాపాడుకోవడం, పర్యావరణం పట్ల బాధ్యతగా వ్యవహరించడం వంటి విలువలను ఈ పండుగ చాటుతుందన్నారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించి భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. ప్రజల మధ్య ప్రేమాభిమానాలు, ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో సుమారు 400 మంది మహిళలు పాల్గొన్నారు. అనంతరం జానకి శుక్లా, మహిళా ఉద్యోగులు లోక్‌‌భవన్‌‌ కొలనులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.