ఆసిఫాబాద్, వెలుగు: ఆదివాసీ ఆరాధ్య దైవం కుమ్రంభీం పుట్టిన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రౌటసంకెపల్లికి ఈ నెల 29న రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా రానున్నారు. గవర్నర్ పర్యటన వివరాలను ఆదివాసీ సంఘాల నాయకులు శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
గ్రామోత్సవం-2026 కార్యక్రమంలో గవర్నర్ పాల్గొననున్నారని, గ్రామంలో సోలార్ ప్యానెళ్లు, వీధి దీపాలు ఏర్పాటు, ఆరోగ్య, సంక్షేమ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పోరాటవీరులు కుమ్రంభీం, ఎడ్ల కొండల్ల కాంస్య విగ్రహాలకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో ఆదివాసీ గిరిజన నాయకులు బుర్స పోచయ్య, సిడాం అర్జు, దాసరి విజయ, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
