
- పీహెచ్ డీ పట్టాలు, గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయనున్న గవర్నర్ తమిళిసై
- కేంద్ర టెక్నాలజీ రీసెర్చ్ బోర్డు సెక్రటరీ కీలకోపన్యాసం
వరంగల్ జిల్లా: కాకతీయ విశ్వవిద్యాలయానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రానున్నారు. ఈనెల 25వ తేదీన గురువారం వర్సిటీలో జరిగే 22వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరుకానున్నారు. యూనివర్సిటీలో పరిశోధనలు పూర్తి చేసిన 56 మందికి పీహెచ్డీ పట్టాలు, బంగారు పతకాలను గవర్నర్ ప్రదానం చేస్తారు. స్నాతకోత్సవం ఏర్పాట్ల గురించి ఇవాళ కాకతీయ యూనివర్సిటీలో వీసీ ప్రొఫెసర్ రమేష్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
2018-19 సంవత్సరాలో వివిధ విభాగంలో 56 మందికి గవర్నర్ పీహేచ్డి పట్టాలు, విశ్వవిద్యాలయంలోని ఆయా విభాగాలలో 192 మందికి 276 బంగారు పతకాలను తెలంగాణ రాష్ట్ర గవర్నర్, కాకతీయ యూనివర్సిటీ ఛాన్స్లర్ తమిళసై సౌందర రాజన్ ప్రదానం చేస్తారని తెలిపారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు సెక్రటరీ ఆచార్య సందీప్ వర్మ కీలకోపన్యాసం చేస్తారని వీసీ రమేష్ వివరించారు.