గర్భిణులు, బాలింతలకు మిల్లెట్లు హెల్దీ ఫుడ్

గర్భిణులు, బాలింతలకు మిల్లెట్లు హెల్దీ ఫుడ్

ఎల్​బీనగర్,వెలుగు: గర్భిణులు, బాలింతలకు కావాల్సిన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు మిల్లెట్లలో ఉన్నాయని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం- –2023-ను పురస్కరించుకొని వనస్థలిపురం రైతు బజార్ వద్ద నయా మిల్లెట్స్ వ్యవవస్థాపకుల ఉచిత మిల్లెట్ అల్పాహార కార్యక్రమాన్ని మంగళవారం గవర్నర్ ప్రారంభించి మాట్లాడారు. గర్భిణులు ఆరోగ్యవంతమైన శిశువులకు జన్మనివ్వాలంటే  మిల్లెట్ ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. 

చిన్న పిల్లలు శక్తివంతంగా ఎదిగేందుకు మిల్లెట్స్ ఫుడ్ దోహదం చేస్తుందని చెప్పారు. తక్కువ పెట్టుబడి, నీటి వాడకంతో చిరుధాన్యాలను పండించవచ్చన్నారు. పిజ్జా, బర్గర్ల వంటివి ఎక్కువగా తింటున్నారని, వాటిని కూడా మిల్లెట్స్ తో చేసుకునేలా మార్పు మనమే తెచ్చుకోవాలని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ నేత పి. మురళీధర్ రావు, హైదరాబాద్ ఐఐఎంఆర్ డైరెక్టర్ సి. తార సత్యవతి, నయా మిల్లెట్ వ్యవస్థాపకుడు  కె. అమర్నాథ్, బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి,మహిళా మోర్చా నేతలు నందికొండ గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.