బతుకమ్మ.. ప్రకృతి పండుగ : గవర్నర్ తమిళిసై

బతుకమ్మ.. ప్రకృతి పండుగ   :  గవర్నర్ తమిళిసై

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర మహిళలకు బతుకమ్మ ఎంతో స్పెషల్ అని గవర్నర్ తమిళిసై అన్నారు. బతుకమ్మ అంటే.. ప్రకృతి పండుగ అని కొనియడారు. బతుకమ్మ సంబురాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మహిళలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతితో ముడిపడి ఉన్న పండుగ.. బతుకమ్మ అని, ఎన్నో ఔషధ గుణాలు ఉన్న తంగేడు పూలతో బతుకమ్మ పేర్చుతారని గుర్తుచేశారు. మహిళలు తమ తల్లిగారింటికి వెళ్లి బతుకమ్మను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్​ చేస్తారన్నారు. 

సీఎం కేసీఆర్ విషెస్..

శనివారం ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ఆడ బిడ్డలందరికీ శుభాకాంక్షలు చెప్పారు. పూలనే దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ, తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీక అన్నారు.  బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకుంటూ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రభుత్వం గొప్పగా గౌరవిస్తున్నదని తెలిపారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఔనత్యాన్ని బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తం చేస్తున్నదని వివరించారు. మహిళా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు స్కీమ్​లు మహిళా సాధికారతను పెంపొందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు.