ఆర్టీసీ బిల్లుపై న్యాయ సలహా కోరిన గవర్నర్‌ తమిళిసై

 ఆర్టీసీ బిల్లుపై న్యాయ సలహా కోరిన గవర్నర్‌ తమిళిసై

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం బిల్లు సహా అన్ని బిల్లులపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ న్యాయ సలహా కోరారు. సూచనలు, సలహాలు బిల్లులో చేర్చారా..? లేదా అనే అంశంపై న్యాయశాఖ సలహా కోరారు గవర్నర్. ఆర్టీసీ బిల్లుపై తప్పుడు ప్రచారాన్ని ఉద్యోగులు నమ్మవద్దని రాజ్ భవన్ వర్గాలు స్పష్టం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను న్యాయశాఖ కార్యదర్శికి పంపినట్టు తెలిపాయి.

రాష్ట్ర ప్రభుత్వ బిజినెస్‌ రూల్స్‌, సచివాలయ నిబంధనలకు లోబడి బిల్లులను న్యాయశాఖ కార్యదర్శికి పంపినట్టు తెలిపాయి. న్యాయశాఖ కార్యదర్శికి బిల్లులు పంపడం సాధారణ ప్రక్రియ అని రాజ్ భవన్ వర్గాలు వివరించాయి. ఉద్యోగుల క్షేమం, కార్పొరేషన్ శ్రేయస్సు కోసం కొన్ని సిఫారసులతో ఆర్టీసీ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతించినట్లు రాజ్ భవన్ వర్గాలు స్పష్టం చేశాయి. 

ఇదే తరహాలో గతంలో వెనక్కు పంపిన నాలుగు బిల్లులకు సంబంధించి సిఫారసులతో కూడిన సందేశాన్ని పంపినట్లు గుర్తు చేశాయి. ఆ సిఫారసులను పరిగణలోకి తీసుకున్నారా..? లేదా..? అన్న అంశాన్ని గవర్నర్ నిర్ధారించుకోవాలని అనుకుంటున్నట్లు పేర్కొంది. దీంతో న్యాయశాఖ కార్యదర్శి చేసే సిఫార్సుల ఆధారంగా బిల్లుపై తదుపరి చర్యలు ఉంటాయని రాజ్ భవన్ వర్గాలు స్పష్టం చేశాయి. ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆపినట్లు, రాష్ట్రపతి ఆమోదానికి పంపాలని నిర్ణయించినట్లు .. ఇతరత్రా వార్తలు వస్తున్న క్రమంలో మీడియాకు ప్రకటన విడుదల చేస్తున్నట్లు వివరించాయి. దురుద్దేశంతో చేస్తున్న అసత్యాలు, నిరాధార ప్రచారంతో ఆందోళనకు గురికావద్దని ప్రజలు, ప్రత్యేకించి ఆర్టీసీ ఉద్యోగులకు రాజ్ భవన్ వర్గాలు విజ్ఞప్తి చేశాయి.