పలకరించుకున్న గవర్నర్‌, ఎమ్మెల్సీ

పలకరించుకున్న గవర్నర్‌, ఎమ్మెల్సీ
  • అమ్మపల్లి సీతారామచంద్రస్వామి ఆలయంలో  పలకరించుకున్న గవర్నర్‌, ఎమ్మెల్సీ 

హైదరాబాద్‌/శంషాబాద్‌/ఎల్ బీనగర్ వెలుగు: బతుకమ్మ ఆడేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దైవ దర్శనానికి వెళ్లిన గవర్నర్‌ తమిళిసై పరస్పరం ఎదురుపడ్డారు. ఇద్దరు కలిసే దైవ దర్శనం చేసుకున్నారు. ఒకరినొకరు పలకరించుకున్నారు. ఈ ఆసక్తికర సన్నివేశానికి శంషాబాద్‌ మండలంలోని అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి దేవాలయం వేదిక అయ్యింది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ ఆలయ ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఎమ్మెల్సీ కవితతో పాటు యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ హాజరయ్యారు. వీరు బతుకమ్మ పేర్చుతున్న సమయంలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా గవర్నర్‌ తమిళిసై దైవ దర్శనానికి వచ్చారు.

గవర్నర్‌ నేరుగా దర్శనానికి వెళ్లగా, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ లార్సన్‌ ఆ తర్వాత దర్శనం చేసుకునేందుకు ఆలయం లోపలికి వచ్చారు. ఆలయ ముఖద్వారం వద్ద గవర్నర్‌, 
ఎమ్మెల్సీ ఎదురెదురుగా నిల్చుకొని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరు పరస్పరం పలుకరించుకున్నారు.గవర్నర్‌ దైవ దర్శనానికి వస్తే అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేకపో
యారు. బతుకమ్మ సంబరాలపైనే పోలీసులు దృష్టి సారించడంతో గవర్నర్‌ కొంత సేపు తన కారులోనే వేచి ఉన్నారు. అనంతరం పోలీసులు భద్రత కల్పించడంతో ఆలయం లోపలికి వెళ్లారు. అర్చకులు ఆమెతో ప్రత్యేక పూజలు చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం గవర్నర్‌ అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. కవిత స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో శంషాబాద్‌ జెడ్పీటీసీ నీరటి తన్వీరాజు తదితరులు పాల్గొన్నారు.

బాలగంగాధర్‌ తిలక్‌ నాకు స్ఫూర్తి

బాలగంగాధర్‌ తిలక్‌ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో తాను పాలు పంచుకున్నానని, బతుకమ్మ పండుగ ద్వారా సాంస్కృతిక, భావజాల వ్యాప్తికి కృషి చేశానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం రాత్రి మీర్‌పేటలోని టీకేఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్మన్‌ తీగల అనితా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.