గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్​ జనవరి 23కు వాయిదా

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్​  జనవరి 23కు వాయిదా

హైదరాబాద్, వెలుగు :  బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్‌‌‌‌, సత్యనారాయణ వేసిన పిటిషన్‌‌‌‌ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ వీరు ఇటీవల హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ సూరేపల్లి నందాల బెంచ్​ పిటిషన్​ను విచారించింది. ఆర్టికల్ 171 ప్రకారం కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆపడానికి వీల్లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. అర్టికల్​ 361 ప్రకారం పిటిషన్లకు విచారణ అర్హత లేదని గవర్నర్ తరఫు న్యాయవాది అభ్యంతరం చెప్పారు. దీంతో పిటిషన్ విచారణార్హతను తేలుస్తామన్న ధర్మాసనం.. విచారణను 23కు వాయిదా వేసింది. దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గత జులైలో అప్పటి కేటినెట్​ తీర్మానం చేసింది. దాన్ని గవర్నర్ తమిళిసై గతేడాది సెప్టెంబర్​లో తిరస్కరించారు.