
కారేపల్లి, వెలుగు: పత్తి మొక్కలను పీకేసిన వారిపై చర్యలు తీసుకొని బాధిత రైతుకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని గోవింద్ తండా గ్రామస్తులు శుక్రవారం కారేపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. గోవింద్ తండా పరిధిలో బర్మావత్ సురేశ్‌కు చెందిన ఎకరం భూమిలో పత్తి మొక్కలను అదే గ్రామానికి చెందిన అతని బంధువైన బర్మావత్ రాందాస్ భూవివాదంతో పీకేశాడు. పత్తిని ధ్వంసం చేసిన తర్వాత రాందాస్ తనకు ఆ భూమికి పట్టా ఉందని కోర్టు ఆర్డర్ కూడా ఉందని చూపుతూ కారేపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు.
ఈ విషయం తెలియడంతో గోవిందు తండా గ్రామస్తులంతా బర్మావత్ సురేశ్ కు మద్దతుగా కారేపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకొని స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. సీఐ తిరుపతిరెడ్డి, ఎస్సై గోపి గ్రామస్తులతో మాట్లాడి వారిని అక్కడి నుంచి పంపించారు. పత్తి చేను పీకిన రాందాస్ పైనా, పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేసిన వారి పైనా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.