Telangana New DGP: తెలంగాణ నూతన డీజీపీగా రవి గుప్తా నియామకం

Telangana New DGP: తెలంగాణ నూతన డీజీపీగా రవి గుప్తా నియామకం

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారన్న కారణంతో తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌ను ఎలక్షన్ కమిషన్(ఈసీ) సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామం చోటు చేసుకున్న గంటల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం రవి గుప్తాను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

రవి గుప్తా 1990 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) డైరెక్టర్ జనరల్‌గా, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అంజనీకుమార్‌‌పై సస్పెన్షన్ ఎందుకంటే...?

నేడు (డిసెంబర్ 3) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తోందని తేలడంతో అంజనీ కుమార్‌.. ఐపీఎస్‌ అధికారులు మహేశ్‌ భగవత్‌, సంజయ్‌ కుమార్‌తో కలిసి రేవంత్‌ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ఫగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో వీరు రేవంత్‌ను కలవడంతో ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకుగానూ డీజీపీని సస్పెండ్‌ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే, ఐపీఎస్ అధికారులు మహేశ్‌ భగవత్‌, సంజయ్‌ కుమార్‌లకు వివరణ ఇవ్వాల్సిందిగా షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.