రేట్లు తగ్గించాలి.. వంట నూనెల కంపెనీలకు కేంద్రం ఆదేశం

రేట్లు తగ్గించాలి..   వంట నూనెల కంపెనీలకు కేంద్రం ఆదేశం
  • వంట నూనె రేటును వారంలో రూ.10 తగ్గించాలె
  • కంపెనీలకు కేంద్రం ఆదేశం

న్యూఢిల్లీ: గ్లోబల్‌గా వంటనూనె ధరలు తగ్గుతున్నందున లోకల్‌ వంట నూనెల కంపెనీలు కూడా రేట్లను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దిగుమతి చేసుకుంటున్న వంట నూనెల ఎంఆర్‌‌పీని లీటర్‌‌పై రూ.10 చొప్పున వారంలోగా తగ్గించాలని పేర్కొంది. ఒక కంపెనీ తయారు చేసే నూనె ధర దేశమంతా ఒకేలా ఉండాలని, ప్రస్తుతం రూ.3–-5 తేడా ఉంటోందని వివరించింది. దేశ వంటనూనె అవసరాల్లో...60% దిగుమతుల ద్వారానే వస్తోంది. రష్యా, -ఉక్రెయిన్ యుద్ధంతో గ్లోబల్‌గా వంట నూనె రేట్లు పెరగడంతో లోకల్‌గా కూడా రేట్లు భగ్గుమన్నాయి. కొన్ని నెలలుగా నూనెల రేట్లు దిగొస్తున్నాయి. కిందటి నెలలో లీటర్‌‌పై రూ.10–15 తగ్గింది. గ్లోబల్‌గా వంట నూనె రేట్లు తగ్గడంపై చర్చించేందుకు ఎడిబుల్‌ ఆయిల్ అసోసియేషన్స్‌, పెద్ద తయారీ కంపెనీలతో ఫుడ్ సెక్రటరీ సుధాన్షు పాండే బుధవారం సమావేశమయ్యారు. గ్లోబల్‌గా తగ్గిన రేట్లను కన్జూమర్లకు బదలాయించాలని వివరించారు. కాగా, బుధవారం నాటికి దేశంలో కేజీ సన్‌ఫ్లవర్ ఆయిల్‌ రూ. 185.77 గా, పామ్‌ ఆయిల్‌ రూ.144 గా, సోయాబీన్‌ ఆయిల్‌ రూ. 185.77 గా, మస్టర్డ్ ఆయిల్ రూ. 177.37 గా, వేరుశనగ నూనె రూ.187.93గా ఉన్నాయి.