రాబోయే మూడు నెలల్లో తగ్గనున్న వంట నూనెలు రేట్లు

రాబోయే మూడు నెలల్లో తగ్గనున్న వంట నూనెలు రేట్లు

వెలుగు బిజినెస్​ డెస్క్​: గ్లోబల్​గా ధరలు దిగివస్తున్న నేపథ్యంలో దేశంలోనూ వంట నూనెల​ రేట్లు తగ్గించాల్సిందేనని తయారీదారులకు  కేంద్ర ప్రభుత్వం సూచించింది.  వేరు శనగ, సోయా, ఆవాల వంట నూనెల ప్యాకెట్లపై ఉండే మాగ్జిమమ్​ రిటెయిల్​ ప్రైస్​ (ఎంఆర్​పీ) తగ్గించాలని, ఆ బెనిఫిట్​ను కన్జూమర్లకు అందించాలని సాల్వెంట్​ ఎక్స్​ట్రాక్టర్స్​ అసోసియేషన్​(ఎస్​ఈఏ)ను డిపార్ట్​మెంట్​ ఆఫ్​ ఫుడ్​ అండ్​ పబ్లిక్​ డిస్ట్రిబ్యూషన్​ కోరింది. దీంతో తయారీదారులందరినీ ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్ఈఏ సూచించింది. అదానీ విల్మార్​, మదర్​ డెయిరీ వంటి కొంతమంది తయారీదారులు వంట నూనెల రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు కూడా.  డిపార్ట్​మెంట్​ ఆఫ్​ ఫుడ్​ అండ్​ పబ్లిక్​ డిస్ట్రిబ్యూషన్ గ్లోబల్​గా వంట నూనెల రేట్లను నిరంతరం గమనించి,​ దేశంలో వాటి రేట్లను ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తుంది. కిందటి ఆరు నెలల్లో గ్లోబల్​గా రేట్లు బాగా తగ్గాయి. ముఖ్యంగా గత 60 రోజులలో వంట నూనెల రేట్లు అంతర్జాతీయ మార్కెట్లలో పడ్డాయి.

దేశంలో వేరుశనగ, సోయా, ఆవాల పంటల దిగుబడులు భారీగా పెరిగినప్పటికీ, వంట నూనెల రేట్లు మాత్రం కిందకి దిగలేదని ఎస్​ఈఏ ప్రెసిడెంట్​ అజయ్ ​జున్​జున్ ​వాలా చెప్పారు. కొంత మంది వంట నూనెల తయారీదారులు ఇప్పటికే రేట్లు తగ్గించారని, కానీ వంట నూనెల ప్యాకెట్లపై ఉండే ఎంఆర్​పీ మాత్రం గ్లోబల్​ రేట్లకు అనుగుణంగా కనబడటం లేదని ఆయన పేర్కొన్నారు. దేశంలోని వంట నూనెల అవసరాల కోసం 60 శాతం దిగుమతులపైనే ఇండియా ఆధారపడుతోంది. వంట నూనెల వినియోగంలో గ్లోబల్​గా మనది రెండో ప్లేస్​. ఫార్చూన్​ బ్రాండ్​ పేరుతో వంట నూనెలు అమ్మే అదానీ విల్మార్​ కంపెనీ లీటరుకు రూ.5, జెమిని ఎడిబుల్​ అండ్​ ఫ్యాట్స్​ ఇండియా లీటరుకు రూ. 10 చొప్పున రేట్లను తగ్గిస్తామని ఇప్పటికే ప్రకటించాయి. ఈ తగ్గింపు బెనిఫిట్​ కన్జూమర్లకు రాబోయే మూడు వారాలలో అందుతుందని ఆ కంపెనీలు పేర్కొన్నాయి.  దిగుమతి చేసుకున్న  సోయాబీన్​  ఆయిల్​ రేటు ముంబైలో గత రెండు నెలల్లో 14.5 శాతం తగ్గాయి. అదేవిధంగా పొద్దుతిరుగుడు నూనె రేట్లు 10.5 శాతం దిగొచ్చాయి. వంట నూనెల రేట్లను తగ్గించాలనే నిర్ణయానికి తాము ఏప్రిల్​30 నే వచ్చామని, ఈ రేట్ల తగ్గింపు ఎఫెక్ట్​ కనబడటానికి రెండు నుంచి మూడు వారాల టైము పడుతుందని అదానీ విల్మార్​  సీఈఓ  అంగ్​షు  మాలిక్​ చెప్పారు. గ్లోబల్​గా పొద్దు తిరుగుడు నూనె రేట్లు భారీగా పతనమయ్యాయి.  పామాయిల్​ కంటే చీప్​గా ఇప్పుడు పొద్దు తిరుగుడు నూనె దొరుకుతోంది. ఎంఆర్​పీ మార్పు అనేది మా కంపెనీలో నిరంతరం కొనసాగే ప్రక్రియేనని జెమిని ఎడిబుల్​ అండ్​ ఫ్యాట్స్​ ఇండియా మేనేజింగ్​ డైరెక్టర్​ ప్రదీప్​ చౌదరి చెప్పారు.  పొద్దు తిరుగుడు నూనె ఎంఆర్​పీని  లీటరుకు రూ. 10 చొప్పున తగ్గించి రూ. 149 కే ఇప్పుడు విక్రయిస్తున్నామని ఆయన 
పేర్కొన్నారు. 

లీటరుకు రూ. 20 తగ్గించిన మదర్​ డెయిరీ...

ధార బ్రాండ్​ పేరుతో వంట నూనెలు అమ్ముతున్న మదర్​ డెయిరీ రేట్లను లీటరుకు రూ. 15 నుంచి రూ. 20 దాకా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ తగ్గుదల వెంటనే అమలులోకి వస్తుందని వెల్లడించింది. సవరించిన ఎంఆర్​పీతో వంట నూనెల ప్యాకెట్లు వచ్చే వారంలోనే మార్కెట్లోకి వస్తాయి.

రాబోయే మూడు నెలల్లో మరింత తగ్గుతాయ్​....

వంట నూనెల రేట్లు రాబోయే మూడు నెలల్లో మరింత తగ్గుతాయని ఎస్​ఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్​ బీ వీ మెహతా వెల్లడించారు. రేట్ల తగ్గుదల కొంత  రుతు పవనాల పైనా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. గత నెల రోజులలో వేరుశనగ, ఆవాలు, పత్తి నూనెల రేట్లు 3 నుంచి 7 శాతం మేర తగ్గాయి. దిగుమతి చేసుకునే వంట నూనెల రేట్లు తక్కువగా ఉండటంతో దేశంలో ఆవాల రేట్లు పడిపోయాయి. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (మినిమం సపోర్ట్​ ప్రైస్​) లెవెల్​ కంటే దిగువకు ఆవాల రేట్లు చేరాయి.