గొత్తికోయలను చత్తీస్‌‌గఢ్‌‌కు తిరిగి పంపేందుకు సర్కార్​ ప్రయత్నాలు

గొత్తికోయలను చత్తీస్‌‌గఢ్‌‌కు తిరిగి పంపేందుకు సర్కార్​ ప్రయత్నాలు

ఖమ్మం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య నేపథ్యంలో గొత్తికోయలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌‌గా స్పందిస్తున్నది. చత్తీస్ గఢ్ నుంచి ఏండ్ల కిందట ఇక్కడికి వచ్చి స్థిరపడిన వారిని తిప్పి పంపించేందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు ప్లాన్ చేస్తున్నారు. గొత్తికోయలను టార్గెట్‌‌గా చేసుకొని స్పెషల్ ఆపరేషన్ మొదలుపెట్టారు. శ్రీనివాసరావు హత్య జరిగిన బెండాలపాడు అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనులు తిరిగి వెళ్లిపోవాలంటూ ఇప్పటికే నోటీసులు అందజేశారు. అంతకు రెండు రోజుల ముందే బెండాలపాడు నుంచి గొత్తికోయలను బహిష్కరిస్తున్నట్టు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. గతంలో కూడా వారికి అటవీ ప్రాంతంలో ఉండొద్దని నోటీసులు ఇచ్చినా.. ఈసారి మాత్రం ఫారెస్ట్ డిపార్ట్‌‌మెంట్ సీరియస్‌‌గా ఉంది. అటవీ ప్రాంతంలో తమ ప్రాణాలకు రక్షణ ఉండాలంటే గొత్తికోయలను రాష్ట్రం నుంచి పంపించేయాలనే డిమాండ్‌‌తో ఆ శాఖ సిబ్బంది జిల్లాల్లో ర్యాలీలు కూడా నిర్వహించారు. మరోవైపు ఫారెస్ట్ అధికారుల నోటీసులతో గొత్తి కోయల గుంపుల్లో అలజడి మొదలైంది. ఏ అర్ధరాత్రి వచ్చి తమను బలవంతంగా తరలిస్తారోననే ఆందోళన వారిలో మొదలైంది.

20 ఏండ్లుగా వలసలు

దాదాపు 20 ఏండ్ల క్రితం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పత్తి, మిర్చి తోటల్లో పనిచేసేందుకు చత్తీస్‌‌గఢ్ నుంచి కూలీలను పదుల సంఖ్యలో ఇక్కడి రైతులు రప్పించేవారు. చత్తీస్‌‌గఢ్‌‌లో నక్సల్స్, సల్వాజుడుం కార్యకర్తల మధ్య గొడవల నేపథ్యంలో కూలి పనుల కోసం వచ్చిన వారు ఇక్కడి అటవీ ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించారు. తర్వాత పోడు చేసుకుంటూ ఇక్కడే సెటిలయ్యారు. క్రమంగా తమ బంధువులను రప్పించడంతో వారి సంఖ్య వేలల్లోకి చేరింది. రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం 34,265 మంది గొత్తికోయలు ఉన్నారు. అయితే ఈ సంఖ్య 50 వేలకు పైనే ఉన్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. వీరి అధీనంలో దాదాపు పాతిక వేల ఎకరాల పోడు భూములున్నాయి. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే 120 గ్రామాల్లో ​3,600 కుటుంబాల్లో 23,990 మంది ఉన్నారు. ఖమ్మం, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో కూడా వీరి సంఖ్య ఎక్కువగానే ఉంది. చాలా మంది ఇక్కడ రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు కూడా తీసుకున్నారు. ఆయా మండలాల్లో పలుకుబడి ఉన్న స్థానిక నేతలు.. గొత్తికోయలను ముందు పెట్టి పోడు కొట్టిస్తూ, వందల ఎకరాల భూములను సాగు చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.

దట్టమైన అడవి మధ్యలో..

రాష్ట్రంలోని గిరిజనులు ఆయా గ్రామాలకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాల్లో పోడు చేసుకుంటుండగా.. గొత్తికోయలు మాత్రం దట్టమైన అడవి మధ్యలో ఆవాసాలు ఏర్పాటు చేసుకొని పోడు కొడుతుంటారని ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు. అందుకే వారు నివసించే ప్రాంతాలకు వెళ్లేందుకు ఫీల్డ్‌‌లో పనిచేసే సిబ్బంది భయపడుతుంటారని అంటున్నారు. ఇక రాత్రి వేళల్లో అటవీ ప్రాంతాల్లో ఆయుధాలు, బాణాలతో తిరుగుతూ జంతువులను వేటాడుతున్నారని పేర్కొంటున్నారు. తాజాగా ఫారెస్ట్ ఆఫీసర్లు రిలీజ్ చేసిన శాటిలైట్ ఇమేజెస్ ప్రకారం బెండాలపాడు అటవీ ప్రాంతం ఎర్రబోడులో 2014కు ముందు ఆవాసాలు లేకుండా పచ్చదనంతో ఉండగా.. ఈ ఎనిమిదేండ్లలో అక్కడ 100 ఎకరాల్లో అటవీ ప్రాంతం మాయమై ఇండ్లు ఏర్పడ్డాయి. దీన్ని గతంలోనే ఫీల్డ్ ఎంక్వైరీలో గుర్తించిన ఆఫీసర్లు.. రేంజర్ శ్రీనివాస రావు ఆధ్వర్యంలో పాతిక ఎకరాలను స్వాధీనం చేసు కొని ప్లాంటేషన్ చేశారు. దీంతో కక్ష పెంచుకున్న గొత్తి కోయలు ఆయన్ను హత్యచేసినట్టు తెలుస్తున్నది. 

బతుకుదెరువు చూపాలి

ఒకరు చేసిన తప్పునకు.. గొత్తికోయలందరినీ తరిమికొట్టాలని ప్రయత్నించడం దారుణమని న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా సెక్రెటరీ ఎస్.కె.సాబీర్ పాషా, సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. గొత్తికోయలందరినీ అడవి నుంచి జనావాసాలకు తరలించి, బతుకుదెరువు చూపేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమండ్ చేశారు.

రాజ్యాంగ విరుద్ధం

ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్యను సాకుగా తీసుకొని గొత్తికోయలను వెళ్లగొట్టాలని ప్రయత్నించడం రాజ్యాంగ విరుద్ధం. గొత్తికోయలకు దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు ఉంది. మన విద్యార్థులు, పౌరులు ఆమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సహా ప్రపంచంలోని చాలా దేశాల్లో నివసిస్తున్నారు కదా. గొత్తికోయలకు భూమి హక్కులతోపాటు, జీవన భద్రతను కల్పించాలి. 
- పోటు రంగారావు, సీపీఐ (ఎంఎల్​) ప్రజా పంథా రాష్ట్ర కార్యదర్శి