చర్యలు తీసుకునేందుకు సర్కార్ జంకుతోంది

చర్యలు తీసుకునేందుకు సర్కార్ జంకుతోంది

హైదరాబాద్, వెలుగు: ఇబ్రహీంపట్నంలో ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీలు వికటించి నలుగురు మృతి చెందిన ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర సర్కార్ జంకుతోంది. దవాఖానలో స్టాఫ్ కొరత, సౌలతుల లేమి తదితర లోపాలను ఎత్తి చూపుతారనే భయంతో బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తోంది. హాస్పిటల్‌‌ ఇన్​చార్జి సూపరింటెండెంట్‌‌గా డాక్టర్ శ్రీధర్‌‌‌‌ అనే వ్యక్తి ఉన్నాడని, అతనిని సస్పెండ్ చేశామని సర్కార్ చెప్పిందంతా కట్టుకథేనని తేలిపోయింది. ఇప్పటివరకూ ఆ డాక్టర్‌‌‌‌కు సస్పెన్షన్ నోటీసులే ఇవ్వలేదు. అసలు తాను సూపరింటెండెంట్‌‌నే కాదని, ఆ రోజు డ్యూటీలో లేనని ఆయన ఆధారాలతో సహా మీడియాకు వెల్లడించారు. తనను సస్పెండ్ చేసినట్టు వీవీపీ కమిషనర్ ప్రకటించడంతో ఆయన వద్దకే వెళ్లి సస్పెన్షన్ నోటీసుల గురించి శ్రీధర్ ప్రశ్నించారు. రాతపూర్వకంగా వివరణ ఇవ్వబోగా తీసుకునేందుకు కమిషనర్‌‌‌‌ నిరాకరించినట్టు తెలిసింది. సస్పెన్షన్ అనేది ప్రకటనల వరకేనని, అలాంటిదేమీ ఉండదని శ్రీధర్‌‌‌‌కు కమిషనర్ సర్దిచెప్పారని, ఇష్యూ సద్దుమణిగే వరకు సెలవులో ఉండాలని సూచించినట్లు సమాచారం.  శ్రీధర్‌‌‌‌ను నిజంగానే సస్పెండ్ చేస్తే ఆయన కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో ఒక హాస్పిటల్‌‌ను సూపరింటెండెంట్‌‌ లేకుండానే నడిపిస్తున్నారన్న విషయం బయటపడే అవకాశముంది. అందుకే ఆయనకు సస్పెన్షన్ నోటీసు ఇవ్వలేకపోతున్నారు. 

స్టాఫ్​పై చర్యలు తీస్కోవాలన్నా బుగులే 

కుటుంబ నియంత్రణ కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలోని కార్యక్రమం. రాష్ట్రంలో దీన్ని అమలు చేసే బాధ్యత హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్‌‌‌‌, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ పరిధిలో ఉంటుంది. ప్రస్తుతం ఈ రెండు పోస్టుల్లోనూ ఐఏఎస్ ఆఫీసర్‌‌ శ్వేత మహంతి ఉన్నారు. వీరు ఇచ్చే షెడ్యూల్ ప్రకారమే ఆయా జిల్లాల్లోని దవాఖాన్లలో స్టాఫ్​ సహకారంతో డీపీఎల్ క్యాంపులు కండక్ట్‌‌ చేస్తారు. ఇబ్రహీంపట్నంలోనూ ఇదే విధంగా జరిగింది. డిప్యూటీ డీఎంహెచ్‌‌వో డాక్టర్ నాగజ్యోతి క్యాంప్ కు ఇన్​చార్జిగా ఉన్నారు. ఇద్దరు డాక్టర్లు సహా 27 మందికి క్యాంపు డ్యూటీలు వేశారు. ఇందులో డాక్టర్‌‌‌‌ జోయల్‌‌ టీమ్‌‌ కూడా ఉంది. స్టెరిలైజేషన్‌‌ బాధ్యత ఈ టీమ్‌‌లోని ముగ్గురు నర్సులు చూశారు. క్యాంపు ఇన్​చార్జి నాగజ్యోతి సహా క్యాంపులో పాల్గొన్న స్టాఫ్‌‌లో ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. అసలు స్టెరిలైజ్ చేయడానికి టైమ్ ఇవ్వకపోతే.. స్టెరిలైజ్ ఎలా చేయగలమో చెప్పాలని స్టాఫ్ ఎదురు ప్రశ్నిస్తున్నారు. డాక్టర్ వేగానికి తగ్గట్టు పనిచేయాల్నా? ఎస్‌‌వోపీ ప్రకారం పనిచేయాల్నా? అనే ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు. క్యాంపు ఇన్​చార్జి అసలు ఆరోజు క్యాంప్​కే రాలేదని అంటున్నారు. 

డీహెచ్ పై విమర్శలు.. శ్వేత మహంతి సైలెన్స్  

ఇబ్రహీంపట్నం ఘటనను డీహెచ్ శ్రీనివాసరావు ఫెయిల్యూర్​గా విమర్శలు వస్తున్నాయి. దీంతో ఈ విషయంపై డీహెచ్‌‌ శనివారం ఓ నోట్ విడుదల చేశారు. ఆపరేషన్లు జరిగిన హాస్పిటల్ వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉందని, కుటుంబ నియంత్రణ కార్యక్రమం ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ పరిధిలో ఉందని నోట్‌‌లో పేర్కొన్నారు. అందుకే ఆ రెండు డిపార్ట్‌‌మెంట్ల హెచ్‌‌వోడీలకు బదులు ఎంక్వైరీ ఆఫీసర్‌‌‌‌గా తనను నియమించారని డీహెచ్ పేర్కొన్నారు. స్టెరిలైజేషన్‌‌లో పొరపాట్లు జరిగినట్టు విచారణలో ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఫైనల్ రిపోర్ట్ తర్వాత బాధ్యులపై చర్యలు కచ్చితంగా ఉంటాయన్నారు. ఘటనకు బాధ్యత వహించాల్సిన ఫ్యామిలీ వెల్ఫేర్‌‌‌‌ కమిషనర్ శ్వేత మహంతి సహా ఆ ఆ డిపార్ట్‌‌మెంట్‌‌ నుంచి ఎవరూ స్పందించలేదు. 

డీపీఎల్ సర్జన్ పైనా ఉత్తుత్తి చర్యలే 

డీపీఎల్ సర్జన్‌‌ డాక్టర్ జోయల్ పైనా చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం చెప్పింది. కానీ, ఆయన లైసెన్స్‌‌ను మెడికల్ కౌన్సిల్ హోల్డ్‌‌లో పెట్టింది తప్పితే, అదేమీ శాశ్వత చర్య కాదు. ఆయన సర్కార్ ఉద్యోగి కూడా కాదు. ఎప్పుడో రిటైర్ అయ్యారు. డీపీఎల్ సర్జన్ల కొరతతో ఆయనతో సర్జరీలు చేయిస్తున్నారు. నలుగురే సర్జన్లు ఉండడంతో, ఆయన సర్జరీలు ఎట్ల చేసినా ఇన్నాళ్లు ఆఫీసర్లు పట్టించుకోలేదు. ఇప్పుడు తనపై గనుక చర్యలు తీసుకుంటే ఇన్నాళ్లు ఎందుకు స్పందించలేదో చెప్పాలని ఆయన రివర్స్ దాడి చేసే చాన్స్​ ఉంది.