Farm house case : సింగిల్ జడ్జి తీర్పుపై ప్రభుత్వం అప్పీల్

Farm house case : సింగిల్ జడ్జి తీర్పుపై ప్రభుత్వం అప్పీల్

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పుపై అప్పీల్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేల కేసులో సిట్ దర్యాప్తును రద్దుచేసిన న్యాయస్థానం కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పును ప్రభుత్వం సవాల్ చేసింది. న్యాయమూర్తి పలు అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని ప్రభుత్వం పరిధి దాటి ఆదేశాలు జారీ చేశారని పిటిషన్ లో పేర్కొంది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయడానికి సీఎం మీడియా సమావేశాన్ని కారణంగా చూపడం తగదని అభిప్రాయపడింది. ఓ రాజకీయ పార్టీ నేతగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రపై సీఎం మాట్లాడారని చెప్పింది. ప్రభుత్వాలను అస్థిరపరిచే ప్రయత్నాలను దేశప్రజలకు తెలిపే ప్రయత్నమే సీఎం వ్యాఖ్యలని చెప్పింది. ఎఫ్‌ఐఆర్‌, పబ్లిక్ డొమైన్‌లో ఉన్న అంశాలపైనే సీఎం మాట్లాడారని తెలిపింది. మీడియా సమావేశంలో సీఎం వ్యాఖ్యలతో దర్యాప్తునకు సంబంధం లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబందించిన సీడీలు.. సీఎంకు ఎలా చేరాయో మిస్టరీగా ఉందనేది సంబంధం లేని అంశమని చెప్పింది. పిటిషన్‌లో ప్రతివాదిగా లేని సీఎం వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవడం తగదని వాపోయింది. సిట్ ఇప్పటివరకు చేసిన దర్యాప్తు రద్దు చేయాలని పిటిషనర్లే కోరలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

నిందితులకు దర్యాప్తు సంస్థలను ఎంచుకునే హక్కు ఉండదని ప్రభుత్వం చెప్పింది. సిట్ పై ఆరోపణలు, అనుమానాలకు ఆధారాలేమిటో చూపలేదని సింగిల్ జడ్జి తీర్పు సరైంది కాదని పిటిషన్ లో పేర్కొంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేసిందనేది ఎఫ్‌ఐఆర్ సారాంశమని వివరించింది. రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా సింగిల్ జడ్జి తీర్పు ఉందని ప్రభుత్వం ఆరోపించింది. వీడియోలను మీడియా బయటపెట్టడం వల్ల నిందితులకు నష్టమనడం పొరపాటేనని తెలిపింది.  చట్టానికి అనుగుణంగానే కేసు దర్యాప్తు సాగుతుందని చెప్పింది. ఇక నిందితులకు అభ్యంతరముంటే ఛార్జ్‌షీట్ వేశాక సవాల్ చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది