
వికారాబాద్ జిల్లా: కరోనా టెస్టు చేయకుండానే పాజిటివ్ గా కన్ఫమ్ చేసిన సంఘటన పరిగి ప్రభుత్వ హాస్పిటల్ లో జరిగింది. పరిగి ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రోగి, అతడి కుటుంబ సభ్యులు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. పరిగి మండలం, రుక్కుంపల్లికి చెందిన చెంద్రయ్య అనే వ్యక్తి కరోనా నుంచి కోలుకుని బ్లాక్ ఫంగస్ తో బాధపడుతున్నాడు. దీంతో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా .. స్వర్ణలత అనే డాక్టర్ కరోనా పరిక్ష చేయకుండానే.. పాజిటివ్ ఉందని కింగ్ కోఠి ఇఎన్ టి ఆస్పత్రికి రెఫర్ చేశారు. డాక్టర్ రెఫర్ చేసిన స్లిప్ లో కరోనా పాజిటివ్ ఉండడంతో కింగ్ కోఠి ఇఎన్ టి ఆస్పత్రి సిబ్బంది చెంద్రయ్యను అడ్మిట్ చేసుకోలేదు.
అక్కడి నుండి మెహదీపట్నం సరోజిని ఆస్పత్రికి వెళ్ళారు. రెఫరల్ స్లిప్ లో కరోనా పాజిటివ్ ఉందని అక్కడ కూడా అడ్మిట్ చేసుకోలేదు. సరోజిని ఆస్పత్రి సూపరింటెండెంట్.. చెంద్రయ్యను గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అంబులెన్స్ ఇచ్చి గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చెంద్రయ్యకు కరోనా ట్రీట్ మెంట్ చేస్తున్నారా.. లేక బ్లాక్ ఫంగస్ చికిత్స చేస్తున్నారా అనే అయోమయంలో పడిపోయారు చెంద్రయ్య కుటుంబ సభ్యులు. పాజిటివ్ ఉందని రెఫర్ చేసిన డాక్టర్ ను ఈ విషయంపై వివరణ కోరగా.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.
ఈ నెల మూడున పాజిటివ్ వచ్చిందని.. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొంది క్వారంటైన్ టైం పూర్తయ్యాక బ్లాక్ ఫంగస్ లక్షణాలు వచ్చాయని గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం హైదరాబాద్ కు రెఫర్ చేయమని అడిగితే.. కరోనా పాజిటివ్ అని రెఫర్ చేయడం పరిగి ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమన్నారు. గాంధీలో చెంద్రయ్యకు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెంద్రయ్యకు మంచి చికిత్స అందేలా ప్రభుత్వం చొరవ చూపాలని రుక్కుంపల్లి గ్రామస్థులు కోరుతున్నారు.