టీవీ9 లోగోను రవిప్రకాశ్ రూ.99వేలకు అమ్మేశారు

టీవీ9 లోగోను రవిప్రకాశ్ రూ.99వేలకు అమ్మేశారు

కంపెనీ నాది.. నా ఇష్టం అని రవిప్రకాశ్ చెప్పారు

శివాజీకి నోటీసులు ఇచ్చాం.. కానీ తప్పించుకుంటున్నాడు

హైకోర్టులో వాదనలు వినిపించిన ప్రభుత్వం తరఫు లాయర్

టీవీ9 సీఈఓ రవిప్రకాష్ కేసులో మంగళవారం మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఇవాళ ప్రభుత్వం వాదనలు వినిపించింది. ABCL – అలంద మీడియాకు జరిగిన షేర్ల కొనుగోలు వివరాలను హైకోర్టుకు వివరించారు ప్రభుత్వం తరపు న్యాయవాది. రవిప్రకాష్ 9 శాతం ఉన్న తన షేర్లలో 40 వేల షేర్లను రూ.20 లక్షలకు హీరో శివాజీకి చెల్లించినట్లు తప్పుడు ధ్రువ పత్రాలు సృష్టించారని అన్నారు. నిజానికి ఫిబ్రవరి 2018న రవిప్రకాష్ ఎలాంటి షేర్లను శివాజీకి కొనుగోలు చేయలేదని చెప్పారు. పోలీసులు సోదాలు చేసినప్పుడు తప్పుడు ధ్రువ పత్రాలు సృష్టించి షేర్లను కొనుగోలు చేసినట్టు తెలిసిందన్నారు.

“40 వేల షేర్లను శివాజీకి రూ.20 లక్షలకు అమ్మితే ఇద్దరూ ఐటీకి లెక్కలు చూపించాలి కదా. ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు ఐటీకి చూపించలేదు. మెజారిటీ షేర్ ఓల్డర్స్ కు తెలియకుండా రూ.99 వేలకు టీవీ9 లోగోను అమ్మివేశాడు. కంపెనీ నాది నా ఇష్టం అని పోలీసుల విచారణలో తెలిపాడు. NCLT లో శివాజీ చేత రవిప్రకాష్ కావాలనే కేసులు వేయించాడు. మెజార్టీ షేర్ హోల్డర్స్ తెలియకుండానే రవిప్రకాష్ మీడియా నెక్స్ట్ కు నిధులు మళ్లించారు. పోలీసులు ఎన్నిసార్లు విచారణకు హాజరు కావాలని పిలిచినా హాజరు కాకుండా తప్పించుకున్నారు. తప్పు చేయక పోతే రవిప్రకాష్ ఎందుకు పోలీసుల విచారణకు హాజరు కాలేదు. శివాజీ అనే వ్యక్తికి నోటీసులు ఇచ్చాం. కానీ పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే పోలీసుల ముందు రవిప్రకాష్ హజరయ్యారు.  పోలీసులు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు రవిప్రకాష్ సమాధానం చెప్పలేదు” అన్నారు ప్రభుత్వ తరఫు లాయర్.

రవిప్రకాష్, హరికిరణ్, మూర్తి మధ్య జరిగిన మెయిల్స్ ఒప్పంద పత్రాలను కోర్ట్ కు సమర్పించింది ప్రభుత్వం. రవిప్రకాష్ కేసును రేపటికి(మంగళవారానికి) వాయిదా వేసింది హైకోర్టు.